Share News

నేడు అన్న క్యాంటీన్లు ప్రారంభం

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:02 AM

ఎర్రగొండపాలెం, సింగరాయకొండ, దర్శిలో నిర్మించిన అన్న క్యాంటీన్లు బుధవారం ఆరంభమవుతున్నాయి. సీఎం చంద్రబాబు వర్చువల్‌గా రాష్ట్రంలోని 62 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్న విషయం విదితమే. అందులోభాగంగా దర్శి, సింగరాయకొండలో బుధవారం నుంచి పేదలకు భోజన వసతి అందుబాటులోకి వస్తోంది.

నేడు అన్న క్యాంటీన్లు ప్రారంభం
దర్శిలో ప్రారంభానికి సిద్ధమైన అన్న క్యాంటీన్‌ భవనం

వైపాలెం, దర్శి, సింగరాయకొండలో నిర్మాణం పూర్తి

వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

హాజరుకానున్న మంత్రి స్వామి, సత్య, ఇన్‌చార్జిలు డాక్టర్‌ లక్ష్మి, ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం/దర్శి/సింగరాయకొండ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి) : ఎర్రగొండపాలెం, సింగరాయకొండ, దర్శిలో నిర్మించిన అన్న క్యాంటీన్లు బుధవారం ఆరంభమవుతున్నాయి. సీఎం చంద్రబాబు వర్చువల్‌గా రాష్ట్రంలోని 62 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్న విషయం విదితమే. అందులోభాగంగా దర్శి, సింగరాయకొండలో బుధవారం నుంచి పేదలకు భోజన వసతి అందుబాటులోకి వస్తోంది. దర్శిలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు స్థానికంగా అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని మునిసిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య కోరారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అన్న క్యాంటీన్‌ ప్రారంభమవుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సింగరాయకొండలో హాజరుకానున్న మంత్రి స్వామి, సత్య

సింగరాయకొండ పంచాయతీ పరిధిలో కందుకూరు రోడ్డుమార్గంలో ప్రభుత్వ వైద్యశాల ఎదుట నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను బుధవారం ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం అనంతరం పేదలకు ఉదయం రూ.5కు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందుబాటులోకి రానుంది.

ఎర్రగొండపాలెంలో పరిశీలించిన ఎరిక్షన్‌బాబు

వైపాలెంలో బుధవారం ప్రారంభించనున్న అన్న క్యాంటీన్‌ను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు నాయకులు, అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిఫిన్‌, భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయనతోపాటు ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, ఎంపీడీవో బండారు శ్రీనివాసులు, చిట్యాల వెంగళరెడ్డి, మహేష్‌, మంత్రునాయక్‌, పంచాయతీ కార్యదర్శి రామ సుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 03:02 AM