అయినా... నోబిడ్!
ABN , Publish Date - Jul 28 , 2026 | 03:06 AM
దక్షిణాది పొగాకు మార్కెట్ ఆశించిన విధంగా మెరుగుప డటం లేదు. మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కసరత్తు చేస్తుండటం.. స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు దృష్టిసారించడంతో పరిస్థితి మారుతుందని రైతులు ఆశించారు.
సగం కేంద్రాల్లో 30శాతంపైనే
వెల్లంపల్లి, కనిగిరిలలో 40 శాతం కన్నా అధికం
మెరుగుపడని సగటు ధరలు
కిలో రూ.192.42కే పరిమితం
ప్రభుత్వాల సాయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
ఒంగోలు, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్ ఆశించిన విధంగా మెరుగుప డటం లేదు. మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కసరత్తు చేస్తుండటం.. స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు దృష్టిసారించడంతో పరిస్థితి మారుతుందని రైతులు ఆశించారు. కానీ అందుకు భిన్నంగానే సాగుతోంది. దక్షిణాదిలోని 11 కేంద్రాల్లో సోమవారం వేలం తీరును పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సగటు ధర పెరగకపోగా నోబిడ్‌లు కూడా భారీగానే కనిపించాయి. సగం వేలం కేంద్రాల్లో 30శాతం పైగా నోబిడ్‌లు ఉండగా వెల్లంపల్లి, కనిగిరి కేంద్రాల్లో అవి 40శాతం కన్నా అధికంగా ఉన్నాయి. మొత్తం 11 కేంద్రాలకు సోమవారం 6,865 బేళ్లను రైతులు వేలానికి తీసుకు రాగా 35.77శాతం వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. 4,409 బేళ్లను మాత్రమే బయ్యర్లు కొనుగోలు చేశారు. తిరస్కరణలు జరిగిన 2,480 బేళ్లలో 1,929 బేళ్లు అధికారులు సూచించిన ధరలకు బయ్యర్లు కొనుగోలు చేయక నోబిడ్ అయ్యాయి. అంటే వేలంకు వచ్చిన మొత్తం బేళ్లలో సుమారు 28.09శాతం నోబిడ్ అయ్యాయి. అత్యధికంగా కనిగిరిలో 42.50శాతం, వెల్లంపల్లిలో 42.36శాతం, టంగుటూరులో 39.11శాతం, ఒంగోలు-1లో 32.41శాతం, ఒంగోలు-2లో 31.19శాతం నోబిడ్‌లు ఉన్నాయి.
మెరుగుపడని ధరలు
సగటు ధరలు కూడా మెరుగుపడటం లేదు. ఈ ప్రాంతంలో ఈనెల 22న సగటు ధర కిలోకు సుమారు రూ.194గా ఉంది. 23న రూ.195, 24న రూ.194, 25న రూ.193 లభించింది. సోమవారం మార్కెట్లో సగటు ధర కిలోకు రూ.192.42 మాత్రమే దక్కింది. మొత్తం 11 కేంద్రాల్లో ఒంగోలు-2, డీసీపల్లిలలో కిలో సగటు ధర రూ.200పైగా లభించగా.. అది కలిగిరి, పొదిలి, కనిగిరి, ఒంగోలు-1, టంగుటూరు తదితర కేంద్రాల్లో రూ.190లోపుగానే ఉంది. ఇదిలాఉండగా పొగాకు రైతులకు ప్రభుత్వం తరఫున ఏమేర సాయం అన్న విషయంపై మంగళవారం స్పష్టత రానుంది. పలు దఫాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, సీఎం సమీక్షల సందర్భంగా కిలోకు రూ.20 బోనస్. వడ్డీ లేకుండా బ్యారన్‌కు రూ.60వేల వరకు తక్షణ రుణ సౌకర్యం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అయితే ప్రభుత్వాలు బోనస్ ఇచ్చినా వ్యాపారులు ఇంకా ధరలు తగ్గిస్తే ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాన్ని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. వ్యాపారుల నుంచి గ్రేడ్‌ల వారీ వేసే ధరపై స్పష్టత ఇవ్వాలని కోరారు. తదనుగుణంగా సంప్రదింపుల బాధ్యతను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఆ సమావేశంలో సీఎం అప్పగించారు. దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. మంగళవారం ఆయా అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు ఇచ్చి పొగాకు కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ఈనెల 29న హైవే దిగ్బంధనకు సన్నద్ధమవుతున్నాయి. అందుకు రైతులను సమాయత్తం చేసేందుకు చేపట్టిన బైక్ యాత్ర సోమవారంతో ముగిసింది.