Share News

గురుకుల పాఠశాలల్లో అనంత అరణ్య

ABN , Publish Date - Jun 04 , 2026 | 03:30 AM

ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా విద్యార్థులు ఉండే చోట్ల అనంత అరణ్య పేరుతో సరికొత్త పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5వతేదీన లాంఛనంగా చేపట్టబోతోంది.

గురుకుల పాఠశాలల్లో అనంత అరణ్య
కొండపి గురుకుల పాఠశాలలో కొలతలు తీస్తున్న డ్వామా సిబ్బంది

పావు ఎకరంలో 1,625 మొక్కలు

జిల్లాలో తొలిగా 31 చోట్ల అమలు

డ్రోన్‌ సర్వేతో నేరుగా ప్రభుత్వమే స్థలాల ఎంపిక

ఈనెల 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా పథకం ప్రారంభం

ఉపాధి హామీ నిధుల వినియోగం

ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా విద్యార్థులు ఉండే చోట్ల అనంత అరణ్య పేరుతో సరికొత్త పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5వతేదీన లాంఛనంగా చేపట్టబోతోంది. భూమి ఎక్కువగా అందుబాటులో ఉండే ఒకే ప్రాంగణంలో కొంతభాగం విభిన్న రకాల మొక్కల పెంపకం ద్వారా సూక్ష్మ అడవుల అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. తొలివిడత జిల్లాలో 31 ప్రాంగణాల్లో దీనిని అధికారులు చేపడుతున్నారు. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా వీటి ఏర్పాటుకు గ్రామీణాభి వృద్ధి శాఖ ఆదేశాలు ఇవ్వగా తదనుగుణంగా జిల్లాలో డ్వామా అధికారులు చర్యలు చేపట్టారు.

ఒంగోలు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): విద్యా సంస్థల ప్రాంగణాల్లో సూక్ష్మ అడవుల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య అంశాలపై కృషి చేస్తున్న హార్ట్‌ఫుల్‌ నెస్‌ ఫౌండేషన్‌ సాంకేతిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. రెండేళ్లలో నెట్‌ జీరో అండ్‌ హెల్త్‌ క్యాంపస్‌లే లక్ష్యంగా రాష్ట్రంలోని 1,089 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల ప్రాంగణాల్లో దీని ని అమలు చేయనున్నారు. ఈ పాఠశాలలు, హాస్టళ్లు చాలా ప్రాంతాల్లో ఐదు నుంచి పది ఎకరాల ప్రాంగణాల్లో నడుస్తున్నాయి. అలాంటిచోట్ల ఆ ప్రాంగణంలో ఒక వైపున లేదా, అవకాశం ఉంటే మధ్యలో పావు ఎకరం విస్తీర్ణం లో విభిన్న జాతుల మొక్కల పెంపకం చేపడతారు.

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు

పరిమితి విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ సమయంలో సహజసిద్ధమైన అడవుల ను సృష్టించేలా చేయనున్నారు. ఎక్కువ విస్తీర్ణం ఉంటే ఒకే ప్రాంగణంలో రెండు, మూడుచోట్ల ఇలాంటివి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పావు ఎకరం యూనిట్‌గా ఉండే ప్రాంతంలో ఏడు స్థాయిల్లోని 1,625 మొక్కలు నాటనున్నారు. ఒక్కోచోట ఏర్పాటుకు సుమారు రూ.5 లక్షలు వ్యయం అంచనా కాగా ఉపాధి హామీ పథకం ద్వారా వీటిని చేపడతారు. మొత్తం వ్యయంలో లేబర్‌ కాంపొనెంట్‌గా రూ.1.80 లక్షలు, మెటీరియల్‌ కింద రూ.3.20లక్షలుగా అంచనా వేశారు.

మూడేళ్లలో అంతా సిద్ధం

మొత్తం మూడేళ్లలో అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఆ మొక్కల ప్రాంతం సహజసిద్ధమైన అడవిగా రూపొందుతుంది. తొలి ఏడాది మొక్కలు నాటడం, కలుపు తొలగింపు, నీటి సరఫరా, ఎరువుల వాడకం కోసం నిధులు ఖర్చు చేస్తారు. అనంతరం రెండేళ్లు వాటి పర్యవేక్షణ, నీటి సరఫరా ప్రధానంగా ఉన్నాయి. కాగా రాష్ట్రంలో 1,089 ప్రాంతాల్లో ఈ ఏడాది ఈ కార్యక్రమం అమలు కోసం గుర్తించగా అందులో జిల్లాలో 31 ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వ స్థాయిలోనే డ్రోన్‌ సర్వేతో ప్రాంగణాలను ఎంపిక చేశారు. అలా జిల్లాలో ఎంపికైన ప్రాంతాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతంలో ఒంగోలులోని దివ్యాంగుల రెసిడెన్షియల్‌ స్కూలు, దర్శిలోని కేజీబీవీ, ఏపీ మోడల్‌ స్కూలు, గురుకుల పాఠశాలల ప్రాంగణాలు, చీమకుర్తిలో గురుకుల పాఠశాల ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో అధికం

గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే బీసీ వేల్ఫేర్‌ పరిధిలో కురిచేడు, లింగసముద్రం, జరుగుమల్లి, సోషల్‌ వెల్ఫేర్‌ పరిధిలో కొత్తపట్నం, కొండపి, కురిచేడు, ఎన్‌జీపాడు సింగరాయకొండ, సంతనూతలపాడు, గిరిజన సంక్షేమశాఖ పరిదిలో గుడ్లూరులోని గురుకుల, కేజీబీవీ హాస్టళ్లు ఉన్నాయి. సమగ్ర శిక్ష పరిధిలో బల్లికురవ, దొనకొండ, గుడ్లూరు, కొత్తపట్నం, కురిచేడు, లింగసముద్రం, మర్రిపూడి, ముండ్లమూరు, పొన్నలూరు, సంతమాగులూరు, ఉలవపాడు, తాళ్లూరు, వీవీపాలెం, జరుగుమల్లి తదితర చోట్ల ఉన్నాయి. ఈనెల 5న లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఎంపిక చేసిన ప్రాంగణాల్లో అవసరమైన చర్యలపై డ్వామా అధికారులు దృష్టిసారించారు.

Updated Date - Jun 04 , 2026 | 03:30 AM