సమర్థవంతంగా సంజీవని
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:57 AM
జిల్లాలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంజీవని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని సమావేశపు హాలులో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
వచ్చేనెలలో జిల్లాలో ట్రయల్ రన్
జనవరి 1నుంచి ప్రజలకు వైద్యసేవలు
ఒంగోలు కలె క్టరేట్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంజీవని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని సమావేశపు హాలులో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సంజీవని పథకం జిల్లాలో అమలు తీరు, వైద్య సిబ్బందికి అందిస్తున్న శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను రాజాబాబు సమీక్షించి దిశానిర్దేశం చేశారు. వచ్చేనెలలో సంజీవని పథకం అమలుకు సంబంధించి జిల్లాలో ట్రయల్‌రన్ నిర్వహిస్తామన్నారు. అందుకోసం అవసరమైన చర్యలను తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 1వ తేదీ నుంచి జిల్లాలో సంజీవని కార్యక్రమం అమలవుతుందని చెప్పారు. అందుకు సంబంధించి జరుగుతున్న నిర్మాణాలను, ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వైద్యాధికారులు, గుర్తించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, బఫర్ సిబ్బందికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రావణ్‌కుమార్, జీజీహెచ్ ఒంగోలు సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.కిరణ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ కేవీ లక్ష్మీకుమారి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూరిబాబు, టాటా కన్సల్టెన్సీ శిక్షణ నిపుణుడు ఆర్సీ దర్శన్ పాల్గొన్నారు. కాగా బ్రిలియంట్ కంప్యూటర్ సంస్థలో మంగళవారం కూడా వైద్యాధికారులకు శిక్షణ నిర్వహించారు. దీన్ని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు సందర్శించి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.