Share News

దర్శి ప్రజలకు అమృతం

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:40 AM

దర్శి మునిసిపాలిటీ పరిధిలోని ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. స్వచ్ఛమైన నీటిని అందించే అమృత్‌ పథకం పనులకు అంతా సిద్ధమైంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్‌కు అధికారులు అగ్రిమెంట్‌ చేశారు.

దర్శి ప్రజలకు అమృతం
ట్యాంకుల నిర్మాణానికి సాయిల్‌ టెస్టింగ్‌ కోసం తీస్తున్ననమూనాలు

టెండర్ల ప్రక్రియ పూర్తి

అగ్రిమెంట్‌ ఖరారు

రూ.130 కోట్లు మంజూరు

జీఎల్‌ఎ్‌సఆర్‌ ట్యాంక్‌ల నిర్మాణానికి

మట్టి నమూనాల సేకరణ

రానున్న 30 ఏళ్లలో పెరగనున్న

జనాభాను దృష్టిలో పెట్టుకుని పనులు

దర్శి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : దర్శి మునిసిపాలిటీ పరిధిలోని ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. స్వచ్ఛమైన నీటిని అందించే అమృత్‌ పథకం పనులకు అంతా సిద్ధమైంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్‌కు అధికారులు అగ్రిమెంట్‌ చేశారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం అమృత్‌ నిధులు మంజూరు చేసింది. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వలన అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమృత్‌ పథకాన్ని తిరిగి ఆచరణలో పెట్టింది. అందులో భాగంగా ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఉమ్మడి ప్యాకేజీ కింద రూ.1,090 కోట్లకు టెండర్లు పిలిచిన విషయం విదితమే. ఈ పనులను మెఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది.

రోజుకు 13 మిలియన్‌ లీటర్ల నీరు శుద్ధి

దర్శి మునిసిపాలిటీ పరిధిలో అమృత్‌ పథకం కింద రూ.130.61 కోట్లతో పనులు పూర్తి చేస్తారు. ముండ్లమూరు మండలం, పులిపాడు చెరువును మంచినీటి చెరువుగా మార్చి నీటిని శుద్ధి చేసేందుకు ఫిల్టర్‌ బెడ్లు నిర్మిస్తారు. పైపులైన్ల ద్వారా దర్శి పట్టణంలోని అన్ని ప్రాంతాలకు ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేసి స్వచ్ఛమైన మంచినీరు అందించనున్నారు. అందులో భాగంగా దర్శిలో జీఎల్‌ఎ్‌సఆర్‌ (గ్రౌండ్‌ లెవల్‌ స్టోరేజీ రిజర్వాయర్‌) ట్యాంకుల నిర్మాణానికి సిబ్బంది మట్టి నమూనాలు తీసుకున్నారు. మట్టి పరీక్షలు పూర్తయిన తర్వాత పనులు ఆరంభిస్తారు. ఈ పథకం పూర్తయితే దర్శి మునిసిపాలిటీలోని 40వేల మంది ప్రజలకు ఈ పథకం ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందుతుంది. రోజుకు 13 మిలియన్‌ లీటర్ల నీరు శుద్ధిచేసి పంపిణీ చేసేలా పథకాన్ని రూపొందించారు. జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని 30 ఏళ్ల వరకు ఇబ్బంది లేకుండా అంచనాలు తయారు చేశారు. నియోజకవర్గంలోని మిగిలిన గ్రామాలకు కూడా సక్రమంగా మంచినీరు అందే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఎన్‌ఏపీ పథకం ద్వారా దర్శి పట్టణంతోపాటు 129 గ్రామాలకు మంచినీరు సరఫరా చేస్తున్నారు. దాని ద్వారా అన్ని గ్రామాలకు సక్రమంగా నీరు అందటం లేదు. అమృత్‌ పథకం ద్వారా దర్శి పట్టణ ప్రజలకు మంచినీరు సరఫరా చేస్తే ఎన్‌ఏపీ మంచినీటి పథకంపై భారం తగ్గి గ్రామీణ ప్రాంతాలకు సరిపడా నీరందించే అవకాశం ఏర్పడుతుంది. ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు టెండర్ల ప్రక్రియ పూర్తయి పనుల నిర్వహణకు శ్రీకారం చుట్టడంతో దర్శి పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 02 , 2026 | 02:40 AM