అమృత్ పథకం టెండరు ఖరారు
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:04 AM
దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు తొలి అడుగు పడింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమృత్ పథకం అమలుకు టెండర్లు ఖరారయ్యాయి. గతంలో అనేకసార్లు టెండర్లు పిలిచినప్పటికీ అనివార్య కారణాలతో ఖరారు కాకుండా రద్దయ్యాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. అందులో భాగంగా అమృత్ పథకం-2 అమలుకు శ్రీకారం పలికింది. పదిరోజుల క్రితం టెండర్లు ఖరారయ్యాయి.
ఇంటింటికీ మంచినీటి కొళాయి పథకం అమలుకు శ్రీకారం
దర్శి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు తొలి అడుగు పడింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమృత్ పథకం అమలుకు టెండర్లు ఖరారయ్యాయి. గతంలో అనేకసార్లు టెండర్లు పిలిచినప్పటికీ అనివార్య కారణాలతో ఖరారు కాకుండా రద్దయ్యాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. అందులో భాగంగా అమృత్ పథకం-2 అమలుకు శ్రీకారం పలికింది. పదిరోజుల క్రితం టెండర్లు ఖరారయ్యాయి.
ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఉమ్మడి ప్యాకేజి కింద టెండర్లు పిలవగా రూ.1090 కోట్లకు మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ టెండర్ దక్కించుకుంది. అందులో దర్శి మున్సిపాలిటీకి అమృత్ పథకం కింద ఇంటింటికీ కొళాయి నిర్మించి స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు రూ.130.61 కోట్లతో టెండరు ఖరారైంది. త్వరలో అగ్రిమెంట్ పూర్తి అయ్యాక సర్వే డిజైన్ చేసి పనులు ప్రారంభించనున్నట్లు పబ్లిక్ హెల్త్ అధికారులు తెలిపారు.
దర్శి మున్సిపాలిటీ పరిధిలోని 40వేల మంది ప్రజలకు ఈపథకం ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించే అవకాశం కల్గుతుంది. ముండ్లమూరు మండలం పులిపాడు చెరువును మంచినీటి చెరువుగా అభివృద్ధి చేసి ఫిల్టర్ బెడ్లు నిర్మించి పైపులైన్లు ద్వారా ఇంటింటికీ శుద్ధి జలాలు అందిస్తారు. రోజుకు 13 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధిచేసే సామర్థ్యం కల్గిన మిషన్లు ఏర్పాటుచేస్తారు. జనాభా పెరుగుదలను అంచనావేసి భవిష్యత్తులో 30 సంవత్సరాల వరకు ఇబ్బందిలేకుండా ఉండేలా ఈపథకాన్ని నిర్మిస్తున్నారు. ఈపథకం అమల్లోకి వస్తే దర్శి ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య పూర్తిగా తీరుతుంది. ప్రస్తుతం ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం ద్వారా దర్శి పట్టణంతో పాటు 129 గ్రామాలకు మంచి నీటి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఎన్‌ఏపీ సమ్మర్ స్టోరేజీ పూడిపోయి నిల్వ సామర్థ్యం తగ్గింది. దీంతో అనేక ప్రాంతాల్లోని శివారు గ్రామాలకు సక్రమంగా మంచినీరు అందించలేకపోతున్నారు. పులిపాడు చెరువును మంచినీటి చెరువుగా అభివృద్ధిచేసి అమృత్ పథకం అమల్లోకివస్తే దర్శి పట్టణ ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి. ఎన్‌ఏపీ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలన్నింటికీ సమృద్ధిగా నీరందించే అవకాశం కల్గుతుంది. అమృత్ పథకం పూర్తయితే దర్శి పట్టణంతో పాటు నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోతుంది.