ఒంగోలు మీదుగా అమృత్ భారత్
ABN , Publish Date - Jan 23 , 2026 | 02:18 AM
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే మంత్రిత్వశాఖ మరో తీపికబురు చెప్పింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు మీదుగా కేరళకు కొత్త రైలును ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తిరువనంతపురానికి అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేసింది. దీన్ని ఈనెల 23 నుంచి ప్రారంభించనుంది.
హైదరాబాద్ నుంచి తిరువనంతపురానికి రైలు
ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు
ఒంగోలు కార్పొరేషన్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే మంత్రిత్వశాఖ మరో తీపికబురు చెప్పింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు మీదుగా కేరళకు కొత్త రైలును ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తిరువనంతపురానికి అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేసింది. దీన్ని ఈనెల 23 నుంచి ప్రారంభించనుంది. వారానికి రెండు సార్లు ఈ రైలు ఒంగోలు మీదుగా నడవనుంది. ఈనెల 27న మంగళవారంహైదరాబాద్ శివారు చర్లపల్లి నుంచి బయల్దేరి తిరువనంతపురం వెళ్తుంది. తిరిగి బుధవారం చర్లపల్లికి చేరుకుటుంది. కాగా 22 బోగీలతో నడిచే అమృత్ భారత్ రైలులో 11 జనరల్, 8 స్లీపర్, ఒకటి గార్డు, ఒకటి లగేజీ ఉంటాయి. ఎక్కువగా జనరల్ బోగీలు ఉండే రైలు ఇదేనని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు జిల్లా ప్రజలకు మరింత సౌకర్యం కానుంది. ప్రతి మంగళ, బుధవారాలలో మాత్రమే నడిచే రైలు పరిమితమైన స్టేషన్లలోనే ఆగనుంది. ఇప్పటికే వందే భారత్‌తో జిల్లా ప్రజలకు రైలు ప్రయాణం మరింత ప్రయోజనకరంగా ఉంది. అమృత్ భారత్ రైలు సత్తెనపల్లి, గుంటూరు మీదుగా తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, జోలార్‌పేట, సేలం స్టేషన్లలో ఆగనుంది. దీంతో ప్రయాణి కులకు సౌలభ్యకరంగా ఉండనుంది.