Share News

బైక్‌ను ఢీకొన్న అంబులెన్స్‌... ఇద్దరు దుర్మరణం

ABN , Publish Date - Sep 23 , 2026 | 01:52 AM

ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని అతివేగంగా వచ్చిన అంబులెన్స్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం త్రిపురాంతకం మండలం గోళ్లపల్లి - వెల్లంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

బైక్‌ను ఢీకొన్న అంబులెన్స్‌...  ఇద్దరు దుర్మరణం
ప్రసాద్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు

మరొకరికి గాయాలు

త్రిపురాంతకం మండలంలో ఘటన

మృతులిద్దరూ బావాబావమర్దులు

త్రిపురాంతకం (ఎర్రగొండపాలెం రూరల్‌), సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని అతివేగంగా వచ్చిన అంబులెన్స్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం త్రిపురాంతకం మండలం గోళ్లపల్లి - వెల్లంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని సోమేపల్లి గ్రామానికి చెందిన నార్నెపాటి కోటేశ్వరరావు (48), పల్లెపోగు ప్రసాద్‌ (29) ద్విచక్రవాహనంపై పనుల నిమిత్తం మార్కాపురానికి వెళ్తున్నారు. గోళ్లపల్లి దాటి వెల్లంపల్లి గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని క్రాస్‌ చేసే సమయంలో వెనుక విజయవాడ నుంచి సున్నిపెంట వైపు వెళ్తున్న ప్రైవేటు అంబులెన్స్‌ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న వరుసకు బావాబావమర్దులిద్దరూ మృతి చెందారు. అంబులెన్సులో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. ఎస్సై శివరామయ్య, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎర్రగొండపాలెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నార్నెపాటి కోటేశ్వరరావుకు భార్య ముగ్గురు సంతాన కాగా, ముగ్గురికీ వివాహాలయ్యాయి. పల్లెపోగు ప్రసాద్‌కు ఇంకా వివాహం కాలేదు.

Updated Date - Sep 23 , 2026 | 01:52 AM