చివరి రోజూ కూటమి జోరు
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:02 AM
మున్సిపల్ ఎన్నికల్లో తొలి నుంచి దూకుడుగా సాగుతున్న టీడీపీ కూటమి ప్రచారం చివరిరోజైన శుక్రవారం మరింత జోరుగా కొనసాగింది. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, చీమకుర్తిలలో ఎన్నికలు జరుగుతుండగా మూడుచోట్ల భారీ కార్యక్రమాలను నిర్వహించింది.
ఒంగోలు, చీమకుర్తిలలో భారీ ర్యాలీలు
పాల్గొన్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు
దామచర్ల, బీఎన్, మాజీ మంత్రి శిద్దా
అద్దంకిలో అభ్యర్థులకు మద్దతుగా
మంత్రి గొట్టిపాటి, ఎంపీ కృష్ణప్రసాద్ ప్రచారం
అంతటా కార్యకర్తల కోలాహలం
ముగిసిన మున్సిపల్ ప్రచారం, రేపు పోలింగ్
నేడు కేంద్రాలకు సిబ్బంది, మెటీరియల్
అద్దంకిలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
అన్ని కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు
ఒంగోలు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ ఎన్నికల్లో తొలి నుంచి దూకుడుగా సాగుతున్న టీడీపీ కూటమి ప్రచారం చివరిరోజైన శుక్రవారం మరింత జోరుగా కొనసాగింది. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, చీమకుర్తిలలో ఎన్నికలు జరుగుతుండగా మూడుచోట్ల భారీ కార్యక్రమాలను నిర్వహించింది. ఒంగోలు, చీమకుర్తిలలో ప్రచారం ముగింపు సందర్భంగా కూటమి పార్టీ కార్యకర్తలతో కోలాహలంగా ర్యాలీలు చేపట్టారు. ఒంగోలులో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పలు డివిజన్లలో మేయర్ అభ్యర్థి శ్రీశిల్ప, జనసేన నేత రియాజ్‌లతో కలిసి రోడ్‌షోలు నిర్వహించారు. సాయంత్రం నగరంలోని కోర్టు సెంటర్‌లో ఉన్న సెంట్రల్ కేఫ్ నుంచి గాంధీరోడ్డు, ట్రంకురోడ్డు, పాత మార్కెట్ సెంటర్‌ల మీదుగా బాపూజీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే జనార్దన్‌తోపాటు మేయర్ అభ్యర్థి శ్రీశిల్ప, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. నగరంలోని పలు డివిజన్లకు చెందిన కూటమి నాయకులు ఉత్సాహంగా హాజరయ్యారు.
చీమకుర్తి, అద్దంకిలలో విస్తృత ప్రచారం
చీమకుర్తిలో టీడీపీ కూటమి శ్రేణులు భారీర్యాలీ నిర్వహించాయి. అక్కడి ఎన్‌ఎస్‌పీ కాలనీ సెంటర్ నుంచి హరిహరక్షేత్రం వరకు సాగిన ర్యాలీలో పట్టణంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు, టీడీపీ కూటమి పార్టీల కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులు ఆ పార్టీల శ్రేణులతో కిటకిటలాడాయి. ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, చైర్మన్ అభ్యర్థి శిద్దా సుధాకర్, వారికి సంపూర్ణ మద్దతుగా నిలుస్తూ ఎన్నికలను పర్యవేక్షిస్తున్న మాజీమంత్రి శిద్దా రాఘవరావు ప్రత్యేక వాహనంపై నిలిచి ర్యాలీలో పాల్గొన్నారు. అద్దంకిలో చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌తో కలిసి అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్‌టీఆర్ నగర్, పోలీస్ స్టేషన్ రోడ్డులలో జరిగిన సభల్లో వారు పాల్గొన్నారు.
ప్రచారానికి తెర
వారంరోజులకుపైగా సాగిన మున్సిపల్ ఎన్నికల బహిరంగ ప్రచారానికి శుక్రవారం తెరపడింది. మూడు పట్టణాల్లోని వివిధ వార్డుల్లో విరామం లేకుండా మోగిన మైకులు, కార్యకర్తల ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు నిలిచిపోయాయి. కాగా తదుపరి ఘట్టమైన పోలింగ్ నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఆయా పట్టణాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, ఇతరత్రా చర్యలు చేపట్టారు. ఆదివారం పోలింగ్ జరగనుండగా శనివారం సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది, సామగ్రిని ఆయా కేంద్రాలకు చేర్చనున్నారు. అద్దంకిలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. అలాగే పోలింగ్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దృష్టి సారించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు