కూటమి ముందంజ
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:47 AM
చివరి విడతగా ఎన్నికలు జరుగుతున్న కందుకూరు మున్సిపాలిటీ, పొది లి నగరపంచాయతీల్లో అన్నివిధాలా కూటమి ముందంజలో కనిపిస్తోంది. రెండు చోట్లా ప్రధాన పోటీగా వైసీపీ ఉన్నప్పటికీ అనేక అంశాల్లో వెనుకబడిపోయింది. కూటమిలోని మూడు పార్టీల మధ్య ఐక్యతతోపాటు టీడీపీ నాయకులంతా కలిసి పనిచేసే విధంగా ఆ పార్టీ అధిష్ఠానం చర్య
మూడు పార్టీలలో సఖ్యత... వైసీపీలో అనైక్యత
ఇటు వైపు ఎమ్మెల్యేలు, పరిశీలకులు, మంత్రుల ప్రచారం
అటువైపు ఇన్‌చార్జిలపైనే మొత్తం భారం
పొదిలిలో టీడీపీకి కలిసొస్తున్న అభ్యర్థి బలం
కందుకూరులో పోటాపోటీగా డబ్బుల పంపిణీ
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
చివరి విడతగా ఎన్నికలు జరుగుతున్న కందుకూరు మున్సిపాలిటీ, పొది లి నగరపంచాయతీల్లో అన్నివిధాలా కూటమి ముందంజలో కనిపిస్తోంది. రెండు చోట్లా ప్రధాన పోటీగా వైసీపీ ఉన్నప్పటికీ అనేక అంశాల్లో వెనుకబడిపోయింది. కూటమిలోని మూడు పార్టీల మధ్య ఐక్యతతోపాటు టీడీపీ నాయకులంతా కలిసి పనిచేసే విధంగా ఆ పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోగా, వైసీపీ పక్షాన ఇన్చార్జిలు మినహా మిగిలిన నాయకులు చేతులె త్తేశారు. వైసీపీ అధిష్ఠానం కనీస సహకారం అందించలేదు. దీంతో ప్రచారం తోపాటు పోలింగ్ ముందురోజు ఓటర్లను ఆకట్టుకునే ఇతరత్రా అంశాల్లో వైసీపీ వెనుకబడిపోవడం స్పష్టంగా కనిపించింది. ప్రకాశం జిల్లాలోని కందు కూరు మున్సిపాలిటీ, మార్కాపురం జిల్లాలోని పొదిలి నగరపంచాయతీలో గురువారం పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండుచోట్లా కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ కూట మి తరఫున బరిలో ఉన్న తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. గెలుపు కోసం ఇరు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతుండగా అన్నింటా టీడీపీ ముందుంది. ఆపార్టీ తరఫున రాష్ట్ర పార్టీ నుంచి అను నిత్యం పర్యవేక్షణ ఉండటం, ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను అప్రమ త్తం చేయడం, పార్టీ పరిశీలకులను స్థానికంగా ఉంచి అందరూ కలిసిపోయే లా చర్యలు తీసుకోవడం లాంటి కార్యక్రమాలు జరిగాయి. వైసీపీలో అలాంటి పరిస్థితి కనిపించలేదు. పైగా స్థానికంగా చాలామంది నాయకులు ప్రచారానికి రాకపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండుచోట్లా ఆ పార్టీ ఇన్చార్జిలకే పూర్తి భారమైంది. ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాల నిర్వహణలోనూ వైసీపీ వెనుకబడిపోవడం స్పష్టంగా కనిపించింది.
కందుకూరులో రసవత్తరం
కందుకూరులో కూటమి అభ్యర్థి పిడికిటి వెంకటేశ్వర్లు, వైసీపీ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. అన్ రిజర్వుడు కింద ఉన్న మున్సిపాలిటీలో టీడీపీ కమ్మ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వగా, వైసీపీ వ్యూహాత్మకంగా బీసీని రంగంలో దింపింది. కూటమి తరఫున ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు జనసేన, బీజేపీ నాయకులు కూడా కలిసి పనిచేశారు. ఆ పార్టీ పరిశీలకుడు ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అక్కడే తిష్టవేసి పర్యవేక్షణ చేశారు. టికెట్ ఆశించిన వారిలో ముఖ్యులైన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, మాల్యాద్రి పార్టీ పక్షాన పనిచేశారు. అయితే జిల్లా ఇన్చార్జి మంత్రికానీ, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కానీ, చివరకు స్థానిక ఎంపీ కూడా ప్రచారంలో కనిపించకపోవడం గమనార్హం. గ్రౌండ్వర్క్లో ఎమ్మెల్యే ఇంటూరి సక్సెస్ కావడం ఆ పార్టీకి బాగా కలిసొస్తోంది. వైసీపీ తరఫున అభ్యర్థి ఎంపికలో అధిష్ఠానానిదే పూర్తి పెత్తనంగా కనిపించింది. ఆ పార్టీ ఇన్చార్జి బుర్రా అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన ఇద్దరు హేమాహేమీ నాయకులని చెప్పుకునే వారు వైసీపీకి మద్దతుగా ప్రచారంలో కనిపించలేదు. కాగా ఇరు పార్టీల నుంచి 40 వార్డుల అభ్యర్థులు రంగంలో ఉండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఇరువైపుల నుంచి ఓటుకు రూ.1000 లెక్కన పంపిణీ జరిగిపోయింది. దీంతో కాస్తంత పోటీ పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ టీడీపీ వైపు ఆశాజనకంగా కనిపిస్తోంది. పోలింగ్‌లో పూర్తిస్థాయిలో వ్యూహం ఫలిస్తే టీడీపీ అభ్యర్థి ఆధిక్యత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
పొదిలిలో వార్ వన్‌సైడే
పొదిలిలో కూటమి అభ్యర్థి వరికూటి అనిల్ అలియాస్ పండుకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, అందరివాడన్న పేరు కలిసొస్తోంది. తాజా పరిస్థితిని పరిశీలిస్తే కూటమి అన్ని విషయాల్లో పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఆ పార్టీ పరిశీలకుడు బీటీనాయుడు అక్కడే తిష్ట వేశారు. ఎమ్మెల్యే నారాయణరెడ్డి సారథ్యంలో స్థానిక నాయకులంతా ఐక్యంగా ముందుకు సాగారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెండుసార్లు పొదిలి వచ్చి పరిస్థితిని సమీక్షించి సలహాలు ఇచ్చి వెళ్లారు. నగరపంచాయతీ పరిధిలో బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ఆర్యవైశ్య, ఎస్సీ ఓటర్ల పూర్తి ఆధిక్యత టీడీపీకే స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో టీడీపీ నుంచి వెళ్లిపోయిన ముస్లిం నాయకులు మళ్లీ చేరడంతో టీడీపీ బలం పుంజుకుంది. ఓటు బ్యాంక్ బలంగా ఉన్న మూడు సామాజికవర్గాల ఓటర్ల పూర్తి ఆధిక్యం టీడీపీకే స్పష్టమైంది. వైసీపీ నుంచి ఆపార్టీ ఐటీ విభాగం జిల్లా కార్యదర్శి కామునూరి వెంకటరావు రంగంలో దిగారు. స్థానిక నాయకులకు సంబంధం లేకుండా అధిష్ఠానం అభ్యర్థిని ఎంపిక చేసింది. దీంతో స్థానిక నాయకుల నుంచి ఆయనకు సరైన సహకారం లభించ లేదు. ఇన్చార్జి అన్నా రాంబాబు, ఆయన కుమారుడు ఒంటరి పోరాటం చేశారు. స్థానిక నాయకుల్లో సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి లాంటి వారు మినహా ఆయా ప్రాంతాల్లో పట్టున్న బలమైన నాయకులు సైడైపోయారు. అభ్యర్థి వారి మద్దతు కోసం వారి ఇళ్ల చుట్టూ తిరగటమే సరిపోయింది. ఇక కూటమి అభ్యర్థి తరఫున ఇతర అన్ని విషయాల్లోనూ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఓటుకు రూ.1,500 ప్రకారం పంపిణీ జరగడం, 6,7 వార్డుల్లో మినహా మిగిలినచోట్ల వైసీపీ అభ్యర్థులు చేతులెత్తేశారు. దీంతో వైసీపీ ప్రధానంగా 5 నుంచి 8 వార్డుల్లో బలమైన పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.