ఏకగ్రీవాల్లో కూటమి జోరు
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:28 AM
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పూర్తి ఆధిక్యం కనబరిచింది. ప్రత్యేకించి ఏకగ్రీవమైన పలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ హవా కనిపించింది. నెలన్నరగా జరుగుతున్న మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికలను పరిశీలిస్తే ఏకగ్రీవాలలో ఆ పార్టీ అభ్యర్థులు గణనీయ సంఖ్యలో గెలుపొందారు.
మూడు చోట్లే వైసీపీ గెలుపు
కొండపి నియోజకవర్గంలో
అత్యధికంగా 51 స్థానాలు టీడీపీవే
మూడో విడత పల్లెపోరు
ఉపసంహరణలు ముగియడంతో స్పష్టత
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పూర్తి ఆధిక్యం కనబరిచింది. ప్రత్యేకించి ఏకగ్రీవమైన పలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ హవా కనిపించింది. నెలన్నరగా జరుగుతున్న మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికలను పరిశీలిస్తే ఏకగ్రీవాలలో ఆ పార్టీ అభ్యర్థులు గణనీయ సంఖ్యలో గెలుపొందారు. మునిసిపల్, జిల్లా, మండల పరిషత్‌లలోనే కాక పంచాయతీల్లోనూ ఏకగ్రీవ స్థానాలు సాధ నలో టీడీపీ జోరు కొనసాగింది. మూడు విడతలు కలిపి 175 పంచాయతీలు ఏకగ్రీవం కాగా అందులో 171 టీడీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు.
ఒంగోలు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ పోరు జరుగుతోంది. చివరి దశ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణల గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో ఏకగ్రీవ పంచాయతీలపై స్పష్టత వచ్చింది. జిల్లాలో మొత్తం 518 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కొండపికి గత ఏడాది ఎన్నికలు జరిగాయి. మంగమూరు, సర్వేరెడ్డిపాలెం ఎన్నికల అంశం కోర్టులో ఉంది. మిగిలిన 515 పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిర్ణయించింది. తొలి విడత ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లోని 139, రెండో దశ అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని 198, చివరి విడత సంతనూతలపాడు, కందుకూరు నియోజకవర్గాల్లోని 178 పంచాయతీల్లో ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చారు.
ఎన్నికలు జరిగే వాటిపై స్పష్టత
తొలి విడత ఎన్నికలు ఈనెల 26న ముగిశాయి. రెండో విడత ఆదివారం జరుగుతున్నాయి. చివరి విడత ఎన్నికలు డిసెంబరు 2న నిర్వహిస్తున్నారు. తుది దశకు కూడా శుక్రవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో ఎన్నికలు జరిగే పంచాయతీలపై పూర్తి స్పష్టత వచ్చింది. జిల్లా మొత్తంగా మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్న 515 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాల్లో 175 ఏకగ్రీవమయ్యాయి. తొలివిడత ఎన్నికలు ప్రకటించిన 139 స్థానాల్లో 62, రెండో విడత ప్రకటించిన 198 పంచాయతీల్లో 75, చివరి దశ ఎన్నికలు నిర్వహిస్తున్న 178 స్థానాల్లో 38 సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. అలా మొత్తం 175 సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా అందులో 171 టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మూడు మాత్రమే వైసీపీ దక్కించుకొంది. ఒకచోట జనసేన గెలుపొందింది.
అగ్రస్థానంలో కొండపి నియోజకవర్గం
జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న 515 పంచాయతీల్లో 175 చోట్ల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో టీడీపీ మద్దతు దారులు ఏకంగా 171 కైవసం చేసుకోగా ఆ పార్టీ మిత్రపక్షం ఒకటి దక్కించుకుంది. ప్రతిపక్ష వైసీపీ మద్దతు అభ్యర్థులు కేవలం మూడు పంచాయతీలను మాత్రమే ఏకగ్రీవంగా సాధించుకున్నారు. ఏకగ్రీవ పంచాయతీల్లో కొండపి నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ 111 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 52 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో 51 టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.
వెనక్కితగ్గిన వైసీపీ మద్దతుదారులు
అత్యధిక గ్రామ పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు పోటీకి వెనక్కు తగ్గారు. అదేసమయంలో టీడీపీలో స్థానికంగా ఉండే గ్రూపుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అత్యధిక గ్రామాల్లో రెండు, మూడు గ్రూపులుగా టీడీపీ స్థానిక నేతలే పోటీపడి నామినేషన్లు వేశారు. అలాంంటి చోట్ల ఒక గ్రూపునకు మద్దతుగా వైసీపీ శ్రేణులు నిలిచి గ్రామాల్లో టీడీపీ వర్గీయుల మధ్య విభజనకు ప్రయత్నం చేశాయి. దాని వల్ల పరస్పరం పోటీకి దిగుతున్న టీడీపీ శ్రే ణులు భారీగా వ్యయం చేయాల్సి వచ్చింది. అంతేకాక భవిష్యత్‌లో కొన్నిచోట్ల గ్రూపు రాజకీయాలు మరింతగా పెరిగే పరిస్థితి నెలకొంది. దీనిని గుర్తించిన టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి కీలక నేతలు అలాంటి గ్రామాలపై దృష్టి సారించి అవకాశం ఉన్న వరకు ఏకగ్రీవాలు జరిగేలా చేశారు. అలా సాధ్యం కాని చోట పార్టీకి నిబద్దతగా పనిచేసే క్షేత్రస్థాయి నాయకులకు మద్దతు ప్రకటించారు.
మూడో దశలో 38 పంచాయతీలు ఏకగ్రీవం
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో విడతలో 38 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 642 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. సంతనూతలపాడు, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో ఉన్న 178 గ్రామపంచా యతీల సర్పంచ్‌లు, 1,756 వార్డు పదవులకు నామినేషన్లను స్వీకరించారు. ఉపసంహరణలు శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 38 పంచాయతీల్లో ఒక్కరు మాత్రమే ఉండటంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వోలు ప్రకటించారు. ఆ పంచాయతీల పరిధిలోని 642 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. మూడో విడతలో ఏకగ్రీవాలు పోను 140 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 353మంది, 1,109 వార్డు పదవులకు 2,312 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కందుకూరు నియోజకవర్గంలో అత్యధికంగా 27 పంచాయతీలు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో 11 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. పోటీలో ఉన్న అభ్యర్థులకు నామినేషన్ల ఉపసంహరణల అనంతరం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఆ వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈనెల 30వతేదీ వరకు ఎన్నికలు ప్రచారం చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించడంతో తదనుగుణంగా అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో కరపత్రాలను ముద్రించుకొని ఇంటింటి ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు. వచ్చేనెల 2వతేదీ ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లపై దృష్టిసారించారు.