Share News

ఎయి‘డెడ్‌’ స్కూళ్లు

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:52 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న ఎయిడెడ్‌ పాఠశాలలకు మూసివేత ముప్పు పొంచి ఉంది. 40మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న బడులకు తాళం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్యను పెంచకోకపోతే చర్యలు తప్పవని విద్యాశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది.

ఎయి‘డెడ్‌’ స్కూళ్లు

40 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలపై వేటు

ఉమ్మడి జిల్లాలో 32 బడులకు ముప్పు

ఇప్పటికే రెండు దఫాలు నోటీసులు

ఒంగోలు విద్య, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న ఎయిడెడ్‌ పాఠశాలలకు మూసివేత ముప్పు పొంచి ఉంది. 40మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న బడులకు తాళం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్యను పెంచకోకపోతే చర్యలు తప్పవని విద్యాశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. పిల్లలను పెంచని పాఠశాలలకు మూడుసార్లు నోటీసులు జారీచేసి అప్పటికీ మార్పు రాకపోతే మూసివేయాలని తాజాగా పాఠశాల విద్య డైరెక్టర్‌ పి.పార్వతి నిర్వహించిన వెబెక్స్‌ సమావేశంలో ఆదేశాలు జారీచేశారు. ఆయా స్కూళ్లకు జారీచేసిన నోటీసులు, యాజమాన్యాలు ఇచ్చిన వివరణలు, దీనికి సంబంధించిన ఫైళ్లన్నీ భద్రంగా ఉంచాలన్నారు. దీనిపై యాజమాన్యాలు ఎవరైనా హైకోర్టును ఆశ్రయిస్తే మన చర్యలను సమర్థించుకునేలా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

32 పాఠశాలలకు రెండోసారి నోటీసులు

జిల్లాలో పిల్లలు తక్కువగా ఉన్న 32 పాఠశాలలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఆ మేరకు మొదట విడత నోటీసులు గతంలోనే ఇచ్చారు. ఈ స్కూళ్లకు జిల్లా విద్యాశాఖ ద్వారా రెండోసారి నోటీసులు ఇటీవల జారీ చేయించారు. పాఠశాలల గుర్తింపు, నోటీసులు జారీ విషయంలో కమిషనర్‌ కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాలను ఇక్కడి డీఈవో కార్యాలయం అమలు చేస్తోంది. జీవో ఎంఎస్‌ నంబరు 1 ప్రకారం విద్యార్థులు తక్కువగా ఉండటంతోపాటు టీచర్లు మిగులుగా ఉన్న పాఠశాలలపై చర్యలకు సిద్ధమయ్యారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని హెచ్చరిస్తున్నా యాజమాన్యాలు స్పందించకపోవడంతో ఆ పాఠశాలలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఎందుకు నిలిపివేయరాదో తెలియజేయాలని గత నెల 13న రెండో విడత నోటీసులు ఇచ్చారు. త్వరలో మూడోసారి నోటీసులు జారీచేసి ఏప్రిల్‌లో మూసివేసేందుకు చూస్తున్నారు.

నోటీసులు అందుకున్న స్కూళ్లు ఇవే..

జిల్లాలో మొత్తం 32 పాఠశాలలలకు ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. మార్కాపురం బోడపాడు ఎయిడెడ్‌ స్కూలులో ఒక్క విద్యార్థి, ఎన్‌జీపాడు మండలం పోతవరం పీవీసీ స్కూలులో నలుగురు విద్యార్థులు, ఒంగోలులోని, ఏబీఎంలో ఆరుగురు, యూసీఎల్‌ఐ స్కూలులో ఏడుగురు, మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి ఆర్‌ఏఈఎస్‌లో తొమ్మిది మంది, ఎన్‌జీపాడు మండలం తిమ్మసముద్రం ఆర్జేహెచ్‌ ఏఐపీఎస్‌లో 10మంది, పీవీసీ మద్దిరాలపాడులో 11మంది, యూసీఎల్‌ఐ క్లౌపేటలో 11మంది, కొమరోలు మండలం ఎస్‌ఆర్‌పల్లె ఎస్‌బీఎన్‌ఆర్‌ఎంలో 12మంది, అమ్మనబ్రోలు ఆర్‌ ఎయిడెడ్‌ పీఎస్‌లో 12మంది, పోతవరం సీఈలో 13మంది, ఉప్పుగుండూరు ఎయిడెడ్‌ పీఎస్‌లో 14మంది, కొప్పోలు ఎయిడెడ్‌ పీఎస్‌లో 14మంది, బసన్నపాలెం ఆర్‌ఏఈఎస్‌లో 15మంది, హెచ్‌ఎంపాడు వెంకటరెడ్డిపల్లి వీసీఏపీఎస్‌లో 16 మంది, కనిగిరి 5వవార్డు ఆరుణశ్రీ ఏపీఎస్‌ 18మంది, హెచ్‌ఎంపాడు ఎస్‌పీఆర్‌ఎంసీలో 19మంది, మార్కాపురం 10వ వార్డు శ్రీవిజయ ఎయిడెడ్‌ యూపీఎస్‌లో 21మంది, ఆజాద్‌ మెమోరియల్‌ 23మంది, ఎన్‌జీపాడు మండలం మాచవరంలో సీఎయిడెడ్‌ 25మంది, పుల్లలచెరువు మండలం మన్నేపల్లి ఉమామహేశఽ్వర ఎయిడెడ్‌ పీఎస్‌ 27మంది, గిద్దలూరు సెయింట్‌ పాల్స్‌లో 30మంది, వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి కేఏఎంసీలో 31మంది, పెద్దారవీడు మండలం తిరుమలాపురం ఎయిడెడ్‌ పీఎస్‌ 33మంది, దొనకొండ మండలం బాదాపురం ఏఎంఏపీఎస్‌ 34మంది, ఒంగోలు హెచ్‌సీఎం పీఎస్‌ 34 మంది, దర్శి మండలం కృష్ణపురం ఎయిడెడ్‌ పీఎస్‌ 36మంది, కనిగిరిలోని రవీందర్‌ ఎయిడెడ్‌లో 36మంది, బేస్తవారపేట అమెరికన్‌ బాప్టిస్టు మిషన్‌ స్కూలులో 37మంది, కొప్పోలు ఏయూపీఎస్‌ పీఆర్‌లో 38మంది, చీమకుర్తి మండలం రాజుపాలెం ఎయిడెడ్‌ సీపీఎస్‌లో 39మంది విద్యార్థులు ఉన్నారు. నిర్ణీత గడువులోపు సమాధానం ఇవ్వకపోతే యాజమాన్యం స్పందించలేదని భావించి తదుపరి చర్యలు చేపడతామని ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 02:52 AM