ఇంటింటికీ వ్యవసాయ శాఖ
ABN , Publish Date - Jun 23 , 2026 | 01:00 AM
వ్యవసాయ శాఖ అధికారు లు, సిబ్బంది రైతు బాట పట్టారు. మరోసారి ‘రైతన్నా మీకోసం’ నిర్వహిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో సోమవారం జిల్లావ్యా ప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 27వరకు కొనసాగ నుంది.
మరోసారి ‘రైతన్నా మీకోసం’
ఈనెల 27వరకు నిర్వహణ
ఎల్‌నినో ప్రభావం, పంటల మార్పిడి,
యాప్ ద్వారా ఎరువులపై అవగాహన
ఒంగోలు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ శాఖ అధికారు లు, సిబ్బంది రైతు బాట పట్టారు. మరోసారి ‘రైతన్నా మీకోసం’ నిర్వహిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో సోమవారం జిల్లావ్యా ప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 27వరకు కొనసాగ నుంది. ఈ ఏడాది మార్చి ఆఖరులో ఒకసారి రైతన్నా మీకోసం నిర్వహించారు. అప్పట్లో రైతుల వద్దకు వెళ్లిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు సంబంధించి వారి అభిప్రాయాల సేకరించారు. ప్రభుత్వ పథకాల గురించి వివ రించారు. తదనుగుణంగా ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు ప్రణాళి కలను రూపొందించారు. ప్రస్తుతం చేపట్టిన రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని మూడు కీలక అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయన్న విషయాన్ని వాతావరణ శాఖ స్పష్టంగా ప్రకటించింది. ఆ ప్రభావాన్ని రైతులకు వివరించడం ప్రధాన అంశంగా ఈ కార్యక్రమంలో చేర్చారు. ఆయా ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావం ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది వివరించనున్నారు.
రెండు లక్షల కుటుంబాలను కలవాలి
ఈ సీజన్ నుంచి కొత్తగా ఎరువులు సరఫరాను యాప్‌లో నమోదు ద్వారా చేయడం ప్రారంభించారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇక ప్రత్యామ్నాయ పంటల సాగును కూడా వారికి వివరించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని 28 మండలాల పరిధిలో 372 రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) ఉండగా వాటిని యూనిట్‌గా చేసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతంలో వలే మూడు రైతు కుటుంబాలను ఒక క్లస్టర్‌గా చేసి ఒక ఆర్‌ఎస్‌కే పరిధిలో సిబ్బంది రోజుకు 30 క్లస్టర్లలోని 90 కుటుంబాలకు ఈ అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. కొన్నిచోట్ల ఒకేసారి ఐదారు క్లస్టర్ల పరిధిలో రైతులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలా సగటున ఒక్కో ఆర్‌ఎస్‌కే పరిధిలో 540 రైతు కుటుంబాల వంతున మొత్తం రెండు లక్షల కుటుంబాలను కలిసి అవగాహన కల్పించనున్నారు. సోమవారం జిల్లాలో ఆర్‌ఎస్‌కేల పరిధిలో కార్యక్రమం ప్రారంభమైంది. టంగుటూరులో జరిగిన రైతన్నా మీకోసంలో జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇతర చోట్ల కూడా సబ్ డివిజన్ ఏడీలు, మండలస్థాయి అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.