Share News

అక్రమాలకు అగ్రిమెంట్‌..!

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:41 PM

దర్శి నియోజకవర్గంలోని పలు మంచినీటి పథకాల టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ మరెన్నో వెలుగులోకి వస్తున్నాయి. పథకం ప్రకారం కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా వైసీపీ సానుభూతిపరులకు లబ్ధిచేకూర్చేందుకు అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. అటు జడ్పీకి, ఇటు దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారాన్ని అడ్డగోలుగా మార్చేందుకు వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు చక్రం తిప్పినట్లు సమాచారం.

అక్రమాలకు అగ్రిమెంట్‌..!
దర్శి ఫిల్టర్‌ బెడ్‌ను పరిశీలిస్తున్న కమిటీ సభ్యులు(ఫైల్‌)

దర్శి నియోజకవర్గంలో పలు నీటి పథకాల నిర్వహణ టెండర్లలో తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్న అక్రమాలు

నిగ్గు తేల్చిన విచారణ కమిటీ

ఎలాంటి పనులు చేయని వైసీపీ నేతలకు ఖరారుపై పలు అనుమానాలు

ఉద్దేశపూర్వకంగా జడ్పీ సీఈవోను తప్పించి గత ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వద్ద ఒప్పందం

విచారణ కమిటీలో జడ్పీ సీఈవో కూడా సభ్యుడిగా ఉండడంపై పలు అనుమానాలు

నిబంధనలకు పూర్తిగా పాతర

దర్శి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : దర్శి నియోజకవర్గంలోని పలు మంచినీటి పథకాల టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ మరెన్నో వెలుగులోకి వస్తున్నాయి. పథకం ప్రకారం కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా వైసీపీ సానుభూతిపరులకు లబ్ధిచేకూర్చేందుకు అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. అటు జడ్పీకి, ఇటు దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారాన్ని అడ్డగోలుగా మార్చేందుకు వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు చక్రం తిప్పినట్లు సమాచారం.

అసలు విషయం...

దర్శి, కురిచేడు, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలకు చెందిన మంచినీటి పథకాల నిర్వహణలో అక్రమాలు వెలుగుచూడటంతో అప్పటి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని కలెక్టర్‌ రాజాబాబు విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. గత 2025 ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు మంచినీటి పథకాలు నిర్వహించిన వారికి అగ్రిమెంట్‌ చేయకుండా, ఎలాంటి పనులు చేయని వైసీపీ నాయకులకు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఎస్‌ఈని విధుల నుంచి తప్పించడమే కాక నిజాలను నిగ్గుతేల్చేందుకు ముగ్గురు అధికారులతో కూడిన విచారణ కమిటీ వేసిన విషయం తెలిసిందే.

టెండర్ల ఖరారు, పనుల ఒప్పందంపై నిబంధనలు గాలికి

లోతుగా పరిశీలిస్తే ఇక్కడ మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం మంచినీటి పథకాలకు సంబంధించి టెండర్లను ఆర్‌డబ్ల్యూఎస్‌ జిల్లా అధికారులు పిలిచి ఖరారు చేస్తారు. కాంట్రాక్టు పొందిన వ్యక్తులకు పనులను అప్పగిస్తూ జడ్పీ సీఈవో అగ్రిమెంట్‌ చేస్తారు. 2025 ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు జరిగిన పనులకు సీఈవోతో సంబంధం లేకుండానే అప్పటి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎలాంటి పనులు చేయని వైసీపీ సానుభూతిపరులకు టెండర్లు ఖరారు చేయటంతో పాటు ఆయనే అగ్రిమెంట్‌ కూడా చేశారు. అలాఎందుకు జరిగిందనే విషయాన్ని పరిశీలించగా.. వైసీపీ సానుభూతిపరులకు అగ్రిమెంట్‌ చేయాలని జడ్పీ సీఈవోపై ఒత్తిడి చేయగా ఆయన అంగీకరించనట్లు తెలిసింది. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈకి ఆ అధికారాన్ని బదిలీ చేయించుకొని ఆయన ద్వారా అగ్రిమెంట్‌ చేయించారు. ఈ అగ్రిమెంట్‌ వ్యవహారంలో ఇంతపెద్ద గూడుపుఠానీ జరగడమేగాక ఎవరి ఒత్తిడితో ఇంత వ్యవహారం నడిచిందనేది తేల్చాల్సి ఉంది. స్థానిక అధికారులు కూడా ఇదంతా జరిగిన మాట వాస్తవమేనని అంగీకరిస్తున్నప్పటికీ అందుకు కారణాలు చెప్పడం లేదు.


కలెక్టర్‌ వద్దకు నివేదిక

నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి పథకాల నిర్వహణ పనుల కేటాయింపు అక్రమాలపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ కమిటీ కొద్దిరోజుల క్రితం కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. ఆ కమిటీలో జడ్పీ సీఈవో కూడా ఒక సభ్యుడిగా ఉండడం గమనార్హం. దీంతో ఈ అగ్రిమెంట్‌లో జరిగిన మాయాజాలాన్ని, అధికారం బదలాయింపును గురించి నివేదికలో ఏం పొందుపరిచారో తెలియాల్సి ఉంది. మంచినీటి పథకాల నిర్వహణ కోసం నిర్వహించిన టెండర్లలో వెలుగు చూస్తున్న అక్రమాలను చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు యథేచ్ఛగా వైసీపీతో అంటకాగుతున్నారు. ఆపార్టీ నాయకులతో గత ప్రభుత్వ హయాంలో నడిపిన అక్రమాలను ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నట్టు ఈచర్యల ద్వారా తెలుస్తోంది. జరిగిన అక్రమాలపై పూర్తి వాస్తవాలను నిగ్గుతేల్చి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 11:41 PM