ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం
ABN , Publish Date - Aug 13 , 2026 | 02:52 AM
ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. స్టైఫండ్ పెంచాలని, ఉద్యోగ విరమణ పదవీకాలం పెంపును ఆపాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారు చేపట్టిన సమ్మె బుధవారం కూడా కొనసాగింది.
జూనియర్ డాక్టర్‌లు వెల్లడి
కొనసాగిన సమ్మె
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. స్టైఫండ్ పెంచాలని, ఉద్యోగ విరమణ పదవీకాలం పెంపును ఆపాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారు చేపట్టిన సమ్మె బుధవారం కూడా కొనసాగింది. ఉదయం9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు బహిష్కరించి స్థానిక జీజీహెచ్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జూడాలలలల సంఘం ప్రతినిధులు భార్గవ్‌సాయి, వినోద్, ఫయాజ్‌ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జూడాలకు అందిస్తున్న విధంగా రాష్ట్రంలోని మెడికోలు, పీజీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు మౌలిక సౌకర్యాలు కల్పించా లన్నారు. ప్రభుత్వ డాక్టర్ల ఉద్యోగ విరమణ 62ఏళ్ల నుంచి65ఏళ్లకు పెంచడం ద్వారా కొత్తగా ఉద్యోగాలలో చేరాలనుకునే యువ వైద్యులకు అవకాశాలు తగ్గుతాయన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్క రించాలని గతంలో అనేకసార్లు రాష్ట్రప్రభుత్వంతో చర్చలు జరిపామన్నారు. అయినప్పటికీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే రెండు దశలలో తమ వినతులను తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ నెల 16లోపు స్పష్టమైన హామీ వెలువడకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. దీంతో అత్యవసర, సాధారణ వైద్యసేవలను పూర్తిగా నిలుపుదల చేసి, తమ పోరాటాన్ని సాగిస్తామని స్పష్టం చేశారు.
వైద్యులకు సెలవులు రద్దు
జూనియర్ డాక్టర్ల సమ్మెలో ఉన్న కారణంగా సర్వజన ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లో రోగులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు వైద్యులకు సెలవులు రద్దు చేశామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.మాణిక్యరావు తెలిపారు. జిల్లాలో పీహెచ్‌సీలు, సీహెచ్‌లలో పనిచేస్తున్న 40మంది స్పెషలిస్ట్ డాక్టర్లను డిప్యుటేషన్‌పై జీజీహెచ్‌లో సేవలకు వినియోగించుకుంటామని చెప్పారు. ఆసుపత్రిలోని200మంది నర్సింగ్ విద్యార్ధుల సేవలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు. జూడాలు మొదటిరోజు సమ్మెలోకి వెళ్లినప్పటికీ 1,840 మంది ఇన్‌పేషెంట్లు, ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ మాణిక్యరావు వెల్లడించారు.