Share News

పొగాకు రైతుల్లో అలజడి

ABN , Publish Date - Aug 18 , 2026 | 02:33 AM

పొగాకు రైతుకు మరో సమస్య వచ్చిపడింది. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో ధరలు లేక, కొనుగోళ్లు సక్రమంగా సాగక నిత్యం భారీ నోబిడ్‌లతో సతమతమయ్యారు. వారు చేసిన ఆందోళనలు, ప్రభుత్వ జోక్యంతో మార్కెట్‌ కొంతమేర కుదుటపడింది.

పొగాకు రైతుల్లో అలజడి
ఒంగోలులో సమావేశమైన రైతు ప్రతినిధులు

అపరాధ రుసుం భారీగా పెంచే యోచనలో బోర్డు

తీవ్రంగా నష్టపోనున్న రైతులు

గతేడాది వలే ఈ సీజన్‌లోనూ కొనసాగించాలని

రైతు ప్రతినిధుల వినతి

పొగాకు రైతుకు మరో సమస్య వచ్చిపడింది. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో ధరలు లేక, కొనుగోళ్లు సక్రమంగా సాగక నిత్యం భారీ నోబిడ్‌లతో సతమతమయ్యారు. వారు చేసిన ఆందోళనలు, ప్రభుత్వ జోక్యంతో మార్కెట్‌ కొంతమేర కుదుటపడింది. ప్రస్తుతం ఆశించిన విధంగా ధరలు లేకపోయినప్పటికీ నోబిడ్‌లు తగ్గడం కొంత ఊరట కలిగిస్తోంది. అయితే తాజాగా అధిక పంట ఉత్పత్తిపై వసూలు చేసే అపరాధ రుసుంను పొగాకు బోర్డు భారీగా పెంచే యోచన చేస్తున్నదన్న సంకేతాలు రావడం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

ఒంగోలు, ఆగస్టు 17 (ఆంధ్ర జ్యోతి): పొగాకు రైతుల్లో మరోసారి అలజడి కనిపిస్తోంది. గత సీజన్‌లో అధిక పంట ఉత్పత్తిపై మూడు శాతం అపరాధ రుసుంను బోర్డు వసూలు చేసింది. అయితే ప్రస్తుత సీజన్‌లో దానిని పది శాతానికిపైగా పెంచే యోచన చేస్తున్నదని, ఈ వారంలోనే అధికారికంగా ప్రకటిస్తుం దన్న సంకేతాలు అందాయి. అసలే ధర లేక, కొనుగోళ్లు సరిలేక తల్లడిల్లుతున్న రైతులకు ఈ సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోంది. పొగాకు పంట సాగు, పంట ఉత్పత్తి బోర్డు నియంత్రణలో ఉంటుంది. నిర్దేశిత పరిమాణం కంటే అధికంగా ఉత్పత్తి చేస్తే ఆ పంట కొనుగోలు చేసే సమయంలో రైతుల నుంచి అపరాధ రుసుంను బోర్డు వసూలు చేస్తోంది. తద్వారా పంటను నియంత్రిం చాలన్నది బోర్డు ప్రధాన లక్ష్యం.

రెండేళ్లు పూర్తిగా ఎత్తేశారు

పదేళ్ల క్రితం అపరాధ రుసుం 10 నుంచి 15శాతం వరకూ ఉండేది. అయితే ప్రతికూల పరిస్థితులను ఇంచుమించు ఏటా ఎదుర్కొంటుండటంతో రైతుల వినతి మేరకు కేంద్ర వాణిజ్య శాఖ అనుమతితో పొగాకు బోర్డు అపరాధ రుసుంను తగ్గిస్తూ వచ్చింది. 2022-23, 2023-24 రెండేళ్లు పూర్తిగా ఎత్తివేసింది. తిరిగి 2024-25 సీజన్‌ నుంచి అపరాధ రుసుం విధించిన బోర్డు ఆ ఏడాది మూడు శాతం వసూలు చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుత సీజన్‌ (2025-26)లో పంట ఉత్పత్తి భారీగా పెరగడం, మార్కెట్‌ తీవ్ర సంక్షోభంలో పడటంతో రానున్న సీజన్‌కు పంట ఉత్పత్తి పరిమాణంలో ఇటీవల బోర్డు భారీగా కోత విధించిన విషయం విదితమే. అదేక్రమంలో ప్రస్తుత సీజన్‌ అధిక పంటపై అపరాధ రుసుంను కూడా మళ్లీ పది శాతానికి పెంచే యోచన చేస్తున్నదని తెలిసి రైతులు కలవరపడిపోతున్నారు.

క్వింటాకు రూ.1,500 నష్టం ఖాయం

ప్రస్తుత సీజన్‌లో పంట ఉత్పత్తి అధికం కాగా ధరలు దారుణంగా దిగజారాయి. దీని వల్ల కిలోకు సగటున గత ఏడాది కన్నా నికరంగా రూ.50 మేర ధరను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో మళ్లీ అపరాధ రుసుంను పది శాతానికి పెంచితే అధిక పంటపై క్వింటాకు రూ.1,500 వరకు రైతులు నష్టపోనున్నారు. ఇదే విషయమై దక్షిణాది వేలం కేంద్రాల రైతు కమిటీల ప్రతినిధులు సోమవారం ఒంగోలులో సమావేశమై చర్చించారు. స్థానిక పొగాకు బోర్డు ఆర్‌ఎం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని వేలం కేంద్రాల నుంచి రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత సమయంలో అపరాధ రుసుం పెంచే యోచనను పొగాకు బోర్డు చేయడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

అసలే నష్టం.. ఇప్పుడు రుసుమా..

అసలే ధరలు లేక నష్టపోతుండగా ఈ సమయంలో పంట ఉత్పత్తి నియంత్రణ పేరుతో అపరాధ రుసుం పెంచడం ఏమిటని రైతు కమిటీల ప్రతినిధులు సమావే శం ద్వారా ప్రశ్నించారు. వచ్చే సీజన్‌కు సాగు, ఉత్పత్తి తగ్గించిన పొగాకు బోర్డు అపరాధ రుసుం పెంపు యోచనను విరమించుకోవాలన్నారు. ప్రస్తుత సీజన్‌కు గత సీజన్‌ వలే మూడు శాతం అపరాధ రుసుం కొనసాగించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వివిధ వేలం కేంద్రాల రైతు ప్రతినిధులు వడ్డెళ్ల వరప్రసాద్‌, గురవారెడ్డి, ఆళ్ల సుబ్బారావు, అబ్బూరి శేషగిరి, జి.కొండారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 02:33 AM