గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆందోళన
ABN , Publish Date - Mar 29 , 2026 | 02:28 AM
ఒంగోలులోని ఒక గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. బుక్ చేసుకున్న తర్వాత ఐదారు రోజులకు కూడా సరఫరా చేయకపోవవంతో ప్రజలు సిలిండర్లను తీసుకొని ఏజెన్సీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు.
బుక్ చేసుకున్నా సిలిండర్ ఇవ్వడం లేదని ఆగ్రహం
కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయిన ఉద్యోగులు
విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు
సమస్య పరిష్కారానికి చర్యలు
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులోని ఒక గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. బుక్ చేసుకున్న తర్వాత ఐదారు రోజులకు కూడా సరఫరా చేయకపోవవంతో ప్రజలు సిలిండర్లను తీసుకొని ఏజెన్సీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఏజెన్సీ ప్రతినిధులు షట్టర్ వేసుకొని వెళ్లిపోవడంతో వారు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారితో మాట్లాడారు. ఒంగోలు నగరంలో అన్ని ఏజెన్సీల నుంచి సిలిండర్లను సరఫరా చేస్తుండగా ఈ ఏజెన్సీ మాత్రం ఇవ్వడం లేదని వినియోగదారులు ఆరోపించారు. సిలిండర్ కోసం ఫోన్లు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులకు ఫోన్ చేసి ఆఫీసు వద్దకు పిలిపించారు. సిలిండర్లను ఎందుకు సరఫరా చేయడం లేదని అడిగి తెలుసుకున్నారు. బుక్ చేసుకున్న వారందరికి ప్రాధాన్యతా క్రమంలో అందజేస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. అయితే గ్యాస్ సిలిండర్ల లారీ రాకపోవడంతో జాప్యం జరిగిందని, వచ్చిన వెంటనే బుక్ చేసుకున్న వారందరికీ అందజేస్తామని చెప్పారు. దీనిపై వినియోగదారులు మాట్లాడుతూ ఒంగోలు నగరంలోని అన్ని ఏజెన్సీలు ప్రతిరోజూ పంపిణీ చేస్తుండగా మీకెందుకు సిలిండర్లు రాలేదని ప్రశ్నించారు. దీంతో పోలీసులు ప్రజలను శాంతింపజేసి బుక్ చేసుకున్న వారందరికీ వెంటనే సిలిండర్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో వినియోగదారులు ఆందోళన విరమించి వెళ్లిపోయారు.