ముదిరిన స్థల వివాదం
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:45 AM
ఓ ప్రైవేటు భూమి ఆక్రమణ విషయమై చోటుచేసుకున్న వివాదం ముదురుతోంది. ముక్తినూతలపాడు పంచాయతీ పరిధిలో ప్రభుత్వం వేసిన లేఅవుట్‌లో తాము స్థలాలు కొనుగోలు చేశామని హక్కుదారులు వెల్లడిస్తుండగా, గత పదిహేనేళ్ల నుంచి తాము నివా సాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నామంటూ మరికొందరు వాపోతున్నారు.
న్యాయం చేయాలంటున్న హక్కుదారులు
వారిపై తిరగబడిన ఆక్రమణదారులు
ఒంగోలు కార్పొరేషన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేటు భూమి ఆక్రమణ విషయమై చోటుచేసుకున్న వివాదం ముదురుతోంది. ముక్తినూతలపాడు పంచాయతీ పరిధిలో ప్రభుత్వం వేసిన లేఅవుట్‌లో తాము స్థలాలు కొనుగోలు చేశామని హక్కుదారులు వెల్లడిస్తుండగా, గత పదిహేనేళ్ల నుంచి తాము నివా సాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నామంటూ మరికొందరు వాపోతున్నారు. బుధవారం స్థలం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అసలేం జరిగిందంటే.. స్థానిక ముక్తినూతల పాడు సర్వే నెం. 185/1ఎ1, 186/1ఎ1లో 1986లో ప్రభుత్వం వెంచర్ ఏర్పాటు చేసింది. అందులో సుమారు తొంబై ప్లాట్‌లు కొనుగోలుచేశారు. వారి పేరుతో రిజిస్టర్ కూడా అయ్యింది. 2018-23మధ్యలో కొంతమంది వైసీపీ నాయకులు పేదల అవసరాన్ని ఆసరా చేసుకుని ప్లాట్‌లు ఇస్తామంటూ ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసుకొని పత్తా లేకుండాపోయారు. వారిని నమ్మి పేదలు అయా స్థలాలలో తాత్కాలికంగా షెడ్లు వేసుకొన్నారు. కొందరు మాత్రమే అక్కడ నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలో హక్కుదారులు తమ భూమిని స్వాఽధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో గృహాలను తొలగించగా, బుధవారం స్థలంలో రక్షణ కంచెలు వేసే క్రమంలో వివాదం చోటుచేసుకుంది. భూయజమానులు స్థలంలోకి వచ్చారని తెలుసుకున్న గృహాలు కోల్పోయిన మహిళలు అక్కడకు చేరుకుని హక్కుదారులతో వాగ్వాదానికి దిగారు. తమ ఇళ్లను తొలగించి స్థలాలను ఆక్రమించారంటూ గొడవ చేశారు. తామే అసలైన హక్కుదారులమంటూ భూయజమానులు గుజ్జలపూడి హరి, అల్లా భక్షుతోపాటు మరికొందరు మీడియాతో మాట్లాడారు. 1986 నుంచి తమ భూములు కాపాడుకుంటున్నామని చెప్పారు. కొందరు రౌడీలు తమపై దౌర్జన్యం చేస్తున్నారని, జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు వాస్తవాలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ భూమిలోకి తాము వెళ్లేందుకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.