మునిసిపాలిటీల్లో ముందస్తు ప్రణాళిక
ABN , Publish Date - Apr 05 , 2026 | 02:34 AM
వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు పురపాలక అధికారులు ముందస్తు ప్రణాళికను రూపొందించారు. గతంతో పోల్చితే ఈసారి పెద్దగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేనప్పటికీ ఎక్కడా గొంతెండకుండా చర్యలు తీసుకుం టున్నారు.
వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల జాగ్రత్తలు
పైప్‌లైన్‌లు, చేతి పంపులకు మరమ్మతులు
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రతిపాదనలు
జిల్లాలోని 4 మునిసిపాలిటీల్లో రూ.4.38 కోట్లతో అంచనాలు
మార్కాపురం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) :వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు పురపాలక అధికారులు ముందస్తు ప్రణాళికను రూపొందించారు. గతంతో పోల్చితే ఈసారి పెద్దగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేనప్పటికీ ఎక్కడా గొంతెండకుండా చర్యలు తీసుకుం టున్నారు. డీప్‌బోర్లను లోతు తవ్వడం, పైపులైన్‌లు, చేతిపంపుల మరమ్మతులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం అంచనాలను తయారు చేశారు. జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పొదిలి మునిసిపాలిటీల్లో రూ.4.38కోట్లు అవసరమవుతా యని ప్రతిపాదించారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో ఏటా వేస విలో నీటి సమస్య నిత్యకృత్యం. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు ఒట్టిపోవడం, రక్షిత నీటి పథకాలు సక్రమంగా పనిచేయక పోవడం వలన ప్రజలు దాహార్తితో అలమటించే వారు. వందల గ్రామాలకు అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సమృద్ధిగా వర్షాలు కురవడం, తాగునీటికి సాగర్ జలాలు పుష్కలంగా విడుదల చేయడం, భూగర్భ జలమట్టం కూడా ఆశాజనకంగా ఉండటంతో తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ పురపాలక శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేశారు. కనిగిరి పురపాలక సంఘం పరిధిలో రానున్న రోజుల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే రోజుకు రూ.68వేలు, నెలకు రూ.20.40లక్షల చొప్పున 6నెలలకు రూ.1.22 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. డీప్‌బోర్లు మరింత లోతు తవ్వేందుకు రూ.12.50 లక్షలు, పైపులైన్‌ల మరమ్మతుల కోసం రూ.15లక్షలు, చేతిపంపులు కోసం రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.1.54 కోట్లతో ముందస్తు అంచనాలు రూపొందించారు.
మార్కాపురంలో రూ.95లక్షలకు ప్రతిపాదనలు
మార్కాపురం పట్టణ ప్రజలకు సాగర్ జలాలు అందించే దూపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో సరిపడా నీరు ఉన్నప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా రూ.95 లక్షలతో పలు పనులకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఎస్‌ఎస్ ట్యాంకుకు తోడు పట్టణంలో ఉన్న డీప్‌బోర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఈ ఏడాది కురిసిన వర్షాల కారణంగా సాగర్ నీరు పుష్కలంగా రావడంతో ఎస్‌ఎస్ ట్యాంకును పూర్తిగా నింపుకున్నారు. 2,200 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకు నిండుగా నీరు ఉన్న కారణంగా పైపులైన్‌ల ద్వారా సరఫరాకు ఇబ్బంది లేని పరిస్థితి. అలాగే భూగర్భ జలాలు పెరగడంతో డీప్‌బోర్లు కూడా సమృద్ధిగా నీటిని అందిస్తున్నాయి. మునిసిపల్ అధికారులు అందజేసిన వివరాల ప్రకారం పట్టణంలో ప్రస్తుతం ఉన్న 164 డీప్‌బోర్లలో 99 పనిచేస్తున్నాయి. మిగిలిన బోర్లకు మరమ్మతులు చేయడం ద్వారా సమస్య లేకుండా చూడవచ్చని, అందుకోసం చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి పరిస్థితిని బట్టి వేసవిలో కూడా నీటి సమస్య రాదనే భావన ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలో భాగంగా 120 రోజులపాటు ప్రతిరోజూ 80 ట్రిప్పుల నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు రూ.40 లక్షలు, 6 బోర్‌వెల్స్ తాత్కాలిక అవసరం కోసం తవ్వేందుకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటితోపాటు 10 బోర్లలో నీటిని ఫ్లషింగ్ చేసేందుకు రూ.10లక్షలు, బోర్ల మరమ్మతులు, పరికరాల కొనుగోలు కోసం రూ.10లక్షలు, పైపు లైన్ల మరమ్మతులు, పరికరాల కొనుగోలుకు రూ.10లక్షలు వెరసి మొత్తం రూ.95 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.
గిద్దలూరు, పొదిలిల్లో..
గిద్దలూరు మునిసిపాలిటీ పరిధిలో వేసవి కోసం నాలుగు నెలలకు అవసరమైన నిధుల అంచనా తయారు చేశారు. ట్యాంకర్లతో సరఫరా కోసం రోజూ 220 చొప్పున 120 రోజులకు 10,200 ట్రిప్పులు అవసరమవుతాయని అంచనా వేశారు. అందుకు రూ.50 లక్షలు అవుతుందని ప్రతిపాదించారు. అత్యవసరంగా 3 బోర్లు తవ్వేందుకు రూ.10 లక్షలు, 10 బోర్లను డీపింగ్ చేసేందుకు రూ.10లక్షలు, 5 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకునేందుకు మూడు నెలల కోసం రూ.20లక్షలు, చేతిపంపులు, డీప్‌బోర్ల మరమ్మతుల కోసం రూ.15 లక్షలు, పైపులైన్ల మరమ్మతులకు రూ.7లక్షలు చొప్పున ముందస్తు కార్యాచరణతో అంచనాలు సిద్ధం చేశారు. పొదిలి మునిసిపాలిటీలో కూడా ఇదే తరహాలో అన్ని వార్డుల్లో నీటి సరఫరా కోసం రూ.77 లక్షలతో అంచనా రూపొందించారు. మొత్తంమీద పట్టణ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అన్ని విధాలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.