Share News

ముందస్తుగా వసూళ్లు

ABN , Publish Date - May 07 , 2026 | 02:33 AM

ఇంటి పన్నుల ముందస్తు వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా మునిసిపాలిటీల తరహాలో పంచాయతీల్లో కూడా ముందుగా ఇంటి పన్నుచెల్లిస్తే ఐదు శాతం రాయితీ (రిబేటు)ని కల్పించింది.

ముందస్తుగా వసూళ్లు
ఉలిచిలో ఇంటిపన్ను డిమాండ్‌ నోటీసు ఇస్తున్న డీపీవో వెంకటేశ్వరరావు

ఇంటి పన్నులపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వం కల్పించిన ఐదుశాతం రాయితీపై ప్రజలకు అవగాహన

రూ.56.60 కోట్ల డిమాండ్‌

ఈనెలాఖరులోపు రెండు జిల్లాల్లో 50శాతం రాబట్టడమే లక్ష్యం

ఆరు రోజుల్లో రూ.30లక్షల వసూలు

ఒంగోలు కలెక్టరేట్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : ఇంటి పన్నుల ముందస్తు వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా మునిసిపాలిటీల తరహాలో పంచాయతీల్లో కూడా ముందుగా ఇంటి పన్నుచెల్లిస్తే ఐదు శాతం రాయితీ (రిబేటు)ని కల్పించింది. ప్రకాశం, మార్కా పురం జిల్లాల్లో ఏటా రూ.56.60 కోట్ల ఇంటి పన్నుల డిమాండ్‌ ఉంది. అయితే 2026-27 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ప్రభుత్వం మే 1 నుంచి 31వతేదీలోపు ఇంటి పన్ను చెల్లించిన వారికి ఐదుశాతం రాయితీ ఇచ్చింది. ఉదాహరణకు ఒక గృహ యజమాని రూ.వెయ్యి ఇంటిపన్ను ఉంటే రూ.50 తగ్గించుకొని ముందుగానే చెల్లించే విధంగా అవకాశం కల్పించింది. గ్రామ పంచాయతీల ఆర్థిక పురోభివృద్ధికి వినూత్న రీతిలో ప్రభుత్వం ఇంటిపన్నుల వసూళ్లకు శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లాలో 519 గ్రామపంచాయతీల్లో రూ.39.72 కోట్లు, మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీల్లో రూ.16.88 కోట్లు కలిపి రూ.56.60 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ రెండు జిల్లాల్లో ఈ నెలాఖరు నాటికి కనీసం 50శాతం మేర ఇంటిపన్నులు వసూలు చేసేవిధంగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది.

వసూలు ప్రారంభం

పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో విస్తృతంగా పన్ను వసూలు ప్రక్రియను ప్రారంభించారు. గత ఆరు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.30 లక్షల మేర వసూలు చేశారు. అందులో ప్రకాశంలో రూ.24.11 లక్షలు, మార్కాపురంలో రూ.5.31 లక్షలు ఉంది. ముందుగా గ్రామాల్లో ధనవంతులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, వివిధ సంస్థల ప్రతినిధులను ఆ శాఖ అధికారులు కలిసి ఇంటి పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ స్వామి తన స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలో ఆయన నివాసానికి ఇంటిపన్ను చెల్లించి ఐదుశాతం రాయితీ పొందారు. ఇలా రెండు జిల్లాల్లో ముఖ్యమైన ప్రజాప్రతినిధులను పంచాయతీ అధికారులు కలిసి ప్రభుత్వం అందిస్తున్న రాయితీని వివరించి ఇంటిపన్నులు వసూళ్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో రాయితీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా వ్యాపార కేంద్రాలుగా ఉన్న చీమకుర్తి మండలం, టంగుటూరు, సంతనూతలపాడు, మద్దిపాడు, సింగరాయకొండ, బల్లికురవ, కొరిశపాడు వంటి మండలాలపై ప్రత్యేక దృష్టిసారించారు.

Updated Date - May 07 , 2026 | 02:33 AM