Share News

రేణింగవరం కేంద్రంగా కల్తీ పెరుగు

ABN , Publish Date - Mar 04 , 2026 | 02:50 AM

పంగులూరు మండలం రేణింగవరం కేంద్రంగా ఇష్టారాజ్యంగా కల్తీ పెరుగు తయారవుతోంది. ఇది వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. దీనిపై ఏడాది క్రితం గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆతర్వాత చర్యలు కరువయ్యాయి.

రేణింగవరం కేంద్రంగా కల్తీ పెరుగు

ఏడాది క్రితం గ్రామస్థులు ఫిర్యాదు

విచారణ చేపట్టి వదిలేసిన అధికారులు

ఇప్పటికీ కొనసాగుతున్న తయారీ

ఆందోళన చెందుతున్న ప్రజలు

అద్దంకి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పంగులూరు మండలం రేణింగవరం కేంద్రంగా ఇష్టారాజ్యంగా కల్తీ పెరుగు తయారవుతోంది. ఇది వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. దీనిపై ఏడాది క్రితం గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆతర్వాత చర్యలు కరువయ్యాయి. దీంతో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. అద్దంకి ప్రాంతంలో పలు డెయిరీలకు నిత్యం సరఫరా అయ్యే పాలు కొన్ని క్యాన్‌లలో విరిగి (షవర్డ్‌) పోతుంటాయి. అటువంటి పాలను పంగులూరు మండలం రేణంగివరం లోని ఓ పాల డెయిరీ నిర్వాహకుడు కొనుగోలు చేస్తుంటారు. షవర్డ్‌ పాలలో రసాయనాలు కలిపి పెరుగుగా మారుస్తుంటారు. ఇలా ఏళ్ల తరబడి వ్యాపారం సాగుతోంది. దీనిపై గ్రామస్థులు ఏడాది క్రితం అధికారులకు ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా అధికారులు తనిఖీలు చేశారు. ల్యాబ్‌ రిపోర్టులలో కూడా కల్తీ పెరుగుగా నిర్ధారణ అయినట్టు గ్రామస్థులు చెప్తున్నారు. అయినప్పటికీ ఆ పాల డెయిరీపై చర్యలు తీసుకోకపోవడం అనేక ఆరోపణలు తావిస్తోంది. సదరు డెయిరీ నిర్వాహకుడు ఇప్పటికే కల్తీ పెరుగును తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతు న్నారు. ప్రస్తుతం అద్దంకి ప్రాంతంలో జరిగే కార్యక్రమాలు, శుభకార్యాలకు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. దీని ధర తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కల్తీ పెరుగు తయారీకి వినియోగించే రసాయనాల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కల్తీ పెరుగు తయారీ, అమ్మకాలపై అధికారుల ఉదాసీనతను ఆదివారం ముప్పవరం వచ్చిన విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్‌ దృష్టికి పలువురు టీడీపీ నేతలు తీసుకుపోయారు. వెంటనే కల్తీ పెరుగు తయారీచేస్తున్న పాల డెయిరీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 02:50 AM