లక్ష్యానికి మించి అడ్మిషన్లు
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:58 AM
ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) ఒకటో తరగతిలో విద్యార్థులు రికార్డు స్థాయిలో చేరారు. అడ్మిషన్లకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతికి రికార్డు స్థాయిలో విద్యార్థుల చేరికలు
ఒంగోలు విద్య, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) ఒకటో తరగతిలో విద్యార్థులు రికార్డు స్థాయిలో చేరారు. అడ్మిషన్లకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఒకటో తరగతి ప్రవేశాల్లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను వెనక్కునెట్టి ప్రభుత్వ స్కూళ్లు అగ్రస్థానంలో నిలిచాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది సుమారు 100.23శాతం మంది పిల్లలు చేరారు. ప్రకాశం జిల్లాలో ఐదేళ్ల వయస్సు ఉండి 1వ తరగతిలో చేరాల్సిన పిల్లలు 15,991 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 55శాతం మంది అంటే 8,796 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీని సాధనకు క్షేత్రస్థాయిలో టీచర్లు శక్తివంచన లేకుండా కృషి చేశారు. గతేడాది పాఠశాలల్లో అమలు చేసిన జీఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం విజయవంతంకావడం కూడా కలిసొచ్చింది. జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం 8,796 మందికి మించి 8,834 మంది విద్యార్థులు శనివారం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఎయిడెడ్ స్కూళ్లలో 228 మంది అడ్మిషన్ పొందారు. అంటే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9,062 మంది విద్యార్థులు చేరారు. ప్రైవేటు, కార్పొ రేట్ పాఠశాలల్లో 6,966 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. జిల్లాలో ఐదేళ్ల వయసు ఉన్న వారు 15,991 మంది ఉండగా మొత్తం 16,028 మంది ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చేరారు. ఆ ప్రకారం ఇతర జిల్లాలకు చెందిన 37 మంది విద్యార్థులు అదనంగా మన జిల్లాలోని పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు.