ఎక్కడికక్కడే సర్దుబాటు
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:46 AM
ఉమ్మడి జిల్లాలో మిగులు టీచర్లను సర్దుబాటు చేసేందుకు మూడు రోజులుగా కొనసాగుతున్న నిరీక్షణకు బుధవారం తెరపడింది. ఎట్టకేలకు మండల విద్యాధికారుల లాగిన్‌కు మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాలు వచ్చాయి.
ఎంఈవోల లాగిన్‌కు మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాలు
మండల స్థాయిలో మమ
ఒంగోలు విద్య, జూలై 8 (ఆంఽధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో మిగులు టీచర్లను సర్దుబాటు చేసేందుకు మూడు రోజులుగా కొనసాగుతున్న నిరీక్షణకు బుధవారం తెరపడింది. ఎట్టకేలకు మండల విద్యాధికారుల లాగిన్‌కు మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో 74 మంది, మార్కాపురం జిల్లాలో 70 మంది మిగులు టీచర్లు తేలారు. వారిని పాఠశాలల నుంచి మండల విద్యావనరుల కేంద్రాలకు పిలిపించి అంతా అర్ధగంటలోపు సర్దుబాటు ప్రక్రియను ముగించి మమ అనిపించారు. ప్రతి మండలంలో మిగులు టీచర్లు కోరుకున్న స్థానాలను వారికి కేటాయించి కౌన్సెలింగ్‌ను ముగించారు. ఏ మండలంలో మిగులు ఆ మండలంలోనే సర్దుబాటు కావడంతో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎవ్వరూ మిగలలేదు. స్కూలు అసిస్టెంట్లు కూడా దాదాపు అదే మండలంలో సర్దుబాటు కావడంతో డివిజన్ స్థాయి కౌన్సెలింగ్‌కు మిగులు టీచర్ల లేకుండాపోయారు.
వారికి ఒరిగిందేమీ లేదు
ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత భారీగా ఉంది. 2025లో చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో చోటుచేసుకున్న తప్పిదం వల్ల మార్కాపురం జిల్లాలోని పాఠశాలలు తీవ్రంగా నష్టపోయాయి. గతంలో బదిలీలు ఎప్పుడు జరిగినా ప్రతి పాఠశాలలో కనీస సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండేలా చూసి మిగిలిన స్థానాలను మాత్రమే ఖాళీ లుగా ప్రకటించేవారు. దీని వల్ల మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో కూడా కనీస సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండేవారు. అయితే అందుకు భిన్నంగా గత ఏడాది పాఠశాలల్లో ఖాళీలన్నింటినీ బదిలీలకు ప్రకటించి గేట్లు ఎత్తేశారు. దీంతో పశ్చిమ ప్రకాశం, ఇతర మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారందరూ మైదాన ప్రాంతాలకు వచ్చేశారు. అక్కడ కొన్ని పాఠశాలల్లో ఒక్క టీచర్ మాత్రమే మిగిలారు. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారెవ్వరూ ఆ పాఠశాలలను కోరుకోకపోవడంతో 150 మంది అక్కడే నిలిచిపోయారు. ప్రస్తుతం టీచర్ల సర్దుబాటు జరిగినప్పటికీ ఈ ఉపాధ్యాయులకు ఒరిగిందేమీ లేదు.