Share News

రోగులకు ఇబ్బంది కలిగితే చర్యలు

ABN , Publish Date - May 19 , 2026 | 03:12 AM

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలిగితే చర్యలు కఠినంగా ఉంటాయని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి అధికారులను హెచ్చరించారు.

రోగులకు ఇబ్బంది కలిగితే చర్యలు
జీజీహెచ్‌లో రోగి బంధువుతో మాట్లాడుతున్న జేసీ కల్పనాకుమారి

జీజీహెచ్‌ అధికారులపై జేసీ కల్పనాకుమారి సీరియస్‌

ఒంగోలు కార్పొరేషన్‌, మే 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలిగితే చర్యలు కఠినంగా ఉంటాయని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి అధికారులను హెచ్చరించారు. సోమవారం ‘జీజీహెచ్‌లో ఆకలి కేకలు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కఽథనంపై కలెక్టర్‌ రాజాబాబు స్పందించారు. విచారణ చేయాలని జేసీ పి.కల్పనాకుమారికి సూచించారు. ఆమె సోమవారం జీజీహెచ్‌ను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడారు. అక్కడి వైద్యసే వలు, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా రోగులు ఓపీ వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందన్నారు. మరో రోగికి అత్యవసరంగా రక్తం అవసరం ఉండగా బాధితుడు జేసీకి విన్నవించుకున్నాడు. ఆ సమయంలో రక్తనిధి సిబ్బంది లేకపోవడంపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. అభ కౌంటర్‌, ఎన్టీఆర్‌ వైద్యసేవ, సదరం, ఎక్స్‌రే, సిటీ, ఎంఆర్‌ఐ విభాగాలను పరిశీలించారు. ఎక్స్‌రేకి ఇబ్బందులు ఉన్న విషయాన్ని గుర్తించి పీఏసీఎస్‌ మెషిన్‌ను వెంటనే తెప్పించాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఫ్యాన్లు, ఏసీలు సక్రమంగా పనిచేసేలా చూడాలని తెలిపారు. ఆహారం విషయంలో ఇబ్బందులపై పలువురు జేసీకి ఫిర్యాదు చేశారు. డైట్‌ కాంట్రాక్టర్‌ గడువు ముగిసినా ఇంకా కొనసాగిస్తున్నారని తెలిసిఅధికారులపై జేసీ మండిపడ్డారు.కొత్త వారి నియామకంపై కోర్టు ఉత్వర్వులు వెలువడి వారంరోజులు అయినా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే డైట్‌ కాంట్రాక్ట్‌కు టెండర్లు ఆహ్వానించాలని ఆదేశించారు. ప్రతిరోజూ డైట్‌ను పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పర్యవేక్షణలోపం కారణంగానే జీజీహెచ్‌లో సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. పారిశుధ్యం అధ్వానంగా ఉండటాన్ని చూసి పనితీరు మార్చుకోవాలని అధికారులను హెచ్చరించారు. వారంరోజుల్లో తాను మళ్లీ విజిట్‌ చేస్తానని, మార్పు కనిపించకుంటే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. అయితే జేసీ అడిగిన పలు ప్రశ్నలకు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాణిక్యరావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ మాధవీలతలు లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. దీంతో సీరియస్‌ అయిన జేసీ మాట్లాడొద్దు కీప్‌ క్వయిట్‌ అంటూ ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా మందుల స్టాక్‌ రికార్డులను పరిశీలించారు.డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నామినేని కిరణ్‌కుమార్‌, డాక్టర్లు తిరుపతిరెడ్డి, ఏఆర్‌ఎంవో సునీల్‌ గవాస్కర్‌ పలువురు జేసీ వెంట ఉన్నారు.

Updated Date - May 19 , 2026 | 03:12 AM