పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:15 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా పక్కాగా పరిష్కరించాలని డీపీవో అనుపమ ఆదేశించారు.
పారిశుధ్యం మెరుగుదలకు ప్రతి కార్యదర్శి బాధ్యతగా పనిచేయాలి
పసుపుగల్లు గ్రామాన్ని సందర్శించి డీపీవో అనుపమ
ముండ్లమూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా పక్కాగా పరిష్కరించాలని డీపీవో అనుపమ ఆదేశించారు. గురువారం మండలంలోని పసుపుగల్లు గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య పనులను పరిశీలించారు. గ్రామానికి చెందిన రావినూతల ఆరోణ్ అనే వ్యక్తి కాలనీలో పారిశుధ్యంతోపాటు సైడు కాలువలు లేవని పీజీఆర్‌ఎ్‌సలో అర్జీ ఇచ్చాడు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో డీపీవో ఆ గ్రామాన్ని సందర్శించి అర్జీదారునితో మాట్లాడారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్‌ఎ్‌సలో మండలం నుంచి 25 అర్జీలు వచ్చాయని, అందులో ఇప్పటికే 11 పరిష్కరించామని చెప్పారు. అర్జీలను అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా తప్పుడు సమాచారంతో ముగింపు చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం లోపించి వ్యాధులు ప్రబలితే ఆ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు ఉంటాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పంచాయతీల రిజర్వేషన్లు కూడా త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పా రు. పూరిమెట్ల, సింగన్నపాలేల్లో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ఆయా గ్రామస్థులు ఫిర్యాదులు చేశారన్నారు. వీటిపై 15రోజులలో నివేదిక ఇవ్వాలని చెప్పారు. గ్రామంలో సైడు కాలువల నిర్మాణానికి పంచాయతీ సాధారణ నిధులు సరిపోవని, ఉపాధి హామీ పథకం ద్వారా మ్యాజిక్ కాలువలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీదేవి, డిప్యూటీ ఎంపీడీవో జనార్దన్, సూపరింటెండెంట్ అబ్దుల్ రహీం పాల్గొన్నారు.