పదే పదే అర్జీలు వస్తే చర్యలు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:41 PM
ఒకే సమస్యపై పదే పదే అర్జీలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.విజయసునీత హెచ్చరించారు.
అధికారులకు కలెక్టర్ విజయసునీత హెచ్చరిక
మార్కాపురం కలెక్టరేట్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : ఒకే సమస్యపై పదే పదే అర్జీలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.విజయసునీత హెచ్చరించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం)లో ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటీవల మెగా గ్రీవెన్స్ పేరుతో వరుసగా నాలుగు వారాల్లో వచ్చిన అర్జీలన్నీ ఐదో వారం పరిష్కరించాలన్నారు. త్వరలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగు వారాల పాటు మెగా గ్రీవెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. పీజీఆర్‌ఎ్‌సలో మొత్తం 161 అర్జీలు రాగా, 79 అర్జీలు రెవెన్యూకు సంబంధించినవని తెలిపారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు శివరామిరెడ్డి, అజయ్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌వో మనీష్, డీఎల్‌డీవో బాలునాయక్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ కరీం, గృహ నిర్మాణ శాఖ పీడీ మెహన్‌రావు, ఆర్టీవో రాంబాబు పాల్గొన్నారు.
కంభం : కంభం చెరువు కట్టపై మంగళవారం ఉదయం జరిగే యోగాంధ్ర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన కలెక్టర్ విజయ సునీత ఆసియా ఖండంలోనే అతిపెద్ద కంభం చెరువు చరిత్ర, చెరువు వైశాల్యం, చెరువు కింద సాగయ్యే భూములు, పంటల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ కెమెరాతో సా యం సంధ్య వేళ కంభం చెరువు నీటిపై వెండిలా మెరుస్తున్న సూర్య కిరణాలు, చెరువు అందాలను చూసి ఆశ్చర్యపోయారు. అలాగే కట్టకి ఇవతల రైలు పట్టాలపై వెళ్తున్న రైలును చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం : కలెక్టర్ విజయసునీత
మార్కాపురం కలెక్టరేట్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ ఎం.విజయసునీత పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ వద్ద పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎం.విజయసునీత, జేసీ శ్రీనివాసులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. దాదాపు 200 మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మన పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. పట్టణ, గ్రామ స్థాయిలోనూ మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకృతితో మమేకమైన వారికి ప్రత్యేక సాంత్వన చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శివరామిరెడ్డి, విద్యుత్ ఎస్‌ఈ కరీం, కమిషనర్ నారాయణరావు పాల్గొన్నారు.