‘ఉపాధి’ సిబ్బందిపై వేటు
ABN , Publish Date - May 21 , 2026 | 03:30 AM
ఉపాధి పనుల్లో కూలీల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బుల పంపకాల విషయంలో బహిరంగంగా వాగ్వివాదానికి దిగిన సిబ్బందిపై డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ వేటు వేశారు. ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. ఈసీని బదిలీ చేశారు.
ఇద్దరు సస్పెన్షన్, ఒకరు బదిలీ
మరో ఇద్దరికి షోకాజ్ నోటీసుల
పొదిలి, మే 20 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి పనుల్లో కూలీల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బుల పంపకాల విషయంలో బహిరంగంగా వాగ్వివాదానికి దిగిన సిబ్బందిపై డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ వేటు వేశారు. ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. ఈసీని బదిలీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్‌కు షోకాజు నోటీసు ఇచ్చారు. ఉపాధి సిబ్బంది రచ్చ శీర్షికన ఈనెల 19న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ విజయసునీత స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు ఏపీడీ నిర్మలమ్మ మంగళవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బందిని విచారించారు. ఆ నివేదికను కలెక్టర్ విజయసునీత, పీడీ జోస్‌ఫకుమార్‌కు అందజేశారు. ఈ మేరకు ఏపీవో మహాలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డిని పీడీ సస్పెండ్ చేశారు. ఈసీ శివకుమార్‌ను రాచర్ల మండలానికి బదిలీ చేశారు. కొనకనమిట్ల మండల ఏపీవో బుల్లెనరావును పొదిలి మండల ఇన్‌చార్జి ఏపీవో బాధ్యతలను అప్పగించారు. మండలంలో ఉపాధి పనుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారించేలా ఆదేశించారు. దీంతో బుధవారం స్థానిక కార్యాలయంలో డ్వామా క్వాలిటీ కంట్రోల్ అధికారి శ్రీనివాసరావు పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా ఆరోపణలు వెల్లువెత్తిన ఆరు గ్రామాలలో పూర్తిస్థాయిలో పరిశీలించనున్నారు. రెండు, మూడురోజుల్లో పరిశీలన అనంతరం పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని శ్రీనివాసరావు చెప్పారు.