భూ అక్రమార్కులపై వేటుకు రంగం సిద్ధం
ABN , Publish Date - Jun 04 , 2026 | 03:26 AM
నగర పాలక సంస్థ పరిధిలోని పేర్నమిట్ట వద్ద సర్వేనెంబర్ 136లో భూ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు చేపట్టిన విచారణలో విస్తుగొలుపే అనేక విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది.
నేడో, రేపో కలెక్టర్‌కు చేరనున్న నివేదిక
సర్వేనెంబర్ల మార్పునకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగం
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : నగర పాలక సంస్థ పరిధిలోని పేర్నమిట్ట వద్ద సర్వేనెంబర్ 136లో భూ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు చేపట్టిన విచారణలో విస్తుగొలుపే అనేక విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. నివేదిక నేడో,రేపో కలెక్టర్ రాజాబాబుకు చేరనుంది. అనంతరం ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నేత, ఇతరులతోపాటు వారికి సహకరించిన రెవెన్యూ యంత్రాం గంపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భూ యజమాని హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఆయన మృతి చెందినట్లు తప్పుడు ధ్రువీకరణపత్రాలు సృష్టించి సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన వైసీపీ నాయకుడు, ఆయన కుటుంబసభ్యులు కలిసి ఇతరులకు విక్రయించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న అసలు భూయజమాని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బాగోతం బయటపడింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగింది. అందుకు అప్పట్లో పనిచేసిన సంతనూతలపాడు రెవెన్యూ అధికారులు సహకరించినట్లు తెలిసింది. అప్పటి తహసీల్దార్, సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) కలిసి సర్వేనెంబర్లు మార్చి ఖాళీగా ఉన్న ప్లాట్లను వైసీపీ నేత ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసేలా సహకరించినట్లు సమాచారం. ఈ భూదందాపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాజాబాబు అదేశించడంతో ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు రంగంలోకి దిగినట్లు తెలిసింది. కొద్దిరోజులుగా ఆ భూమికి సంబంధించి రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. ఆ భూమిని ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు? ఎన్ని ప్లాట్లు వేశారు? ఎంత మందికి విక్రయించారు? ఇంకా ఎన్నిపాట్లు ఉన్నాయి? తదితర వివరాలన్నింటినీ సేకరించినట్లు తెలిసింది. రూ.కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా వైసీపీ నేతకు అప్పగించేందుకు అప్పటి రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో అండదండలు అందించారని విచారణలో తేలినట్లు సమాచారం. ఇంకోవైపు ఆ ప్లాట్ల కొనుగోలుదారుల నుంచి కూడా ఆర్డీవో సమాచారాన్ని సేకరించారు. ప్రణాళికాబద్ధంగానే ఆ భూమిని కొల్లగొట్టి ఇతరులకు విక్రయించారన్న నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ భూఅక్రమాలపై సమగ్ర నివేదికను రెండు రోజుల్లో కలెక్టర్ రాజాబాబుకు ఇవ్వనున్నారు. అనంతరం ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.