Share News

అవినీతి ‘ప్లానింగ్‌’పై వేటు..!

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:50 AM

ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌లోని ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేయడంతోపాటు మరో ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని గుంటూరు రోడ్‌లో జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉండగా, దానిని ప్రైవేటు స్థలంగా చూపిస్తూ ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతులు ఇవ్వడంపై పురపాలక శాఖ సీరియస్‌ అయింది.

అవినీతి ‘ప్లానింగ్‌’పై వేటు..!

ప్రభుత్వ స్థలానికి ప్రైవేటుదిగా అనుమతులు

ఒంగోలు కార్పొరేషన్‌లో ఐదుగురు అధికారుల సస్పెన్షన్‌

మరో ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలు

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై28 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌లోని ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేయడంతోపాటు మరో ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని గుంటూరు రోడ్‌లో జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉండగా, దానిని ప్రైవేటు స్థలంగా చూపిస్తూ ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతులు ఇవ్వడంపై పురపాలక శాఖ సీరియస్‌ అయింది. మంగమ్మ కాలేజీ జంక్షన్‌ సమీపంలోని జాతీయ రహదారి-16ను ఆరు లైన్‌లుగా విస్తరించేందుకు గతంలో హైవే అధికారులు భూసేకరణ చేశారు. అందులో ప్రస్తుతం పాత బైపాస్‌ రోడ్డు పక్కనే ఉన్న భవనం, ఖాళీ స్థలానికి సంబంధించి యాజమానులకు రూ.కోట్లలో నష్టపరిహారం చెల్లించారు. ఆ తర్వాత కొప్పోలు వైపు ఆరు లైన్‌ల రోడ్డు నిర్మాణం చేపట్టడంతో గుంటూరు రోడ్‌లోని ఓల్డ్‌ బైపాస్‌ను మెయింటినెన్స్‌ కింద ఆర్‌అండ్‌బీ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ స్థలంలో భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు జరిగాయి. అందుకోసం గతంలో పనిచేసిన మునిసిపల్‌ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై నగరానికి చెందిన ఓ లాయర్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అవినీతి తెర మీదకు వచ్చింది. ఈ మేరకు క్రమశిక్షణ చర్యల కింద టీపీవో బాబూరావు, టీపీఎస్‌ షేక్‌ రసూల్‌, వార్డ్‌ వెల్ఫేర్‌, ప్లానింగ్‌ సెక్రటరీలు జి.సాయిమురళీకృష్ణ, కె.జోషి, ఎస్‌.శిరీషలను సస్పెండ్‌ చేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అప్పటి మునిసిపల్‌ కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావుపై చార్జెస్‌ ఫ్రేమ్‌ చేయడంతోపాటు, ప్రస్తుతం రిటైర్‌ అయిన అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ సుధాకర్‌, టీపీవో నారాయణపెన్షన్‌లో కోత విధించనున్నారు.

Updated Date - Jul 29 , 2026 | 02:50 AM