Share News

నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు

ABN , Publish Date - Aug 22 , 2026 | 03:09 AM

పోలీసుల కారు ప్రమాదంపై ఆరా తీసిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద ఇటీవల పోలీసు అధికారులు వెళ్తున్న కారు ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. దీంతో అక్కడి ప్రజలు పోలీసుల తీరును తప్పుబట్టారు.

నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు

రోడ్డు ప్రమాదంపై ఐజీ మండిపాటు

ఘటనపై ఎస్పీ నివేదిక అందజేత

దర్శి డీఎస్పీకి షోకాజు నోటీసు

వీఆర్‌కు సంతమాగులూరు ఎస్‌ఐ

బల్లికురవ ఎస్‌ఐ, సంతమాగులూరు సీఐలకు చార్జిమెమోలు

ఒంగోలుక్రైం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : పోలీసుల కారు ప్రమాదంపై ఆరా తీసిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద ఇటీవల పోలీసు అధికారులు వెళ్తున్న కారు ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. దీంతో అక్కడి ప్రజలు పోలీసుల తీరును తప్పుబట్టారు. వారిపై అనేక ఆరోపణలు చేశారు. ఘటనపై ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు విచారణ చేపట్టి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. గురువారం గుంటూరు రేంజ్‌ ఐజీ.. సంతమాగులూరు, అద్దంకి పోలీసు స్టేషన్లతోపాటు, బల్లికురవ మండలం ఈర్ల గంగమ్మ గుడిని, చుట్టుపక్కల ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ అసలు ఏమి జరిగింది అన్న దానిపై ఆరా తీశారు. ఆ మేరకు నిర్లక్ష్యం ప్రదర్శించిన నలుగురు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. సంతమాగులూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావును వీఆర్‌కు పంపారు. దర్శి డీఎస్పీ బాలమురళికి షోకాజు నోటీసు జారీచేశారు. సంతమాగులూరు సీఐ శేషగిరిరావు, బల్లికురవ ఎస్‌ఐ నాగరాజులకు చార్జిమోమోలు జారీచేస్తూ ఆదేశాలు ఇచ్చారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి రోడ్డుప్రమాదానికి కారణం కావడంపై ఐజీ మండిపడ్డారు. అదేవిధంగా పోలీసు అధికారులను పర్యవేక్షించాల్సిన డీఎస్పీ పనితీరు సక్రమంగా లేదని ఆయనకు షోకాజు నోటీసు ఇచ్చారు.

Updated Date - Aug 22 , 2026 | 03:09 AM