Share News

పులిని చంపిన కేసులో నిందితుడి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:14 PM

నల్లమలలో పులిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పులిని చంపిన కేసులో నిందితుడి ఆత్మహత్యాయత్నం

విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్న అటవీ అధికారులు

కిటికీ అద్దాలు పగులగొట్టి పొడుచుకున్న వైనం

గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : నల్లమలలో పులిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అందిన సమాచారం మేరకు గత నెలలో రాచర్ల మండలం జెల్లివారి పుల్లలచెరువు సమీపంలో పెద్దపులి చనిపోయిన విషయం విదితమే. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, అటవీశాఖ ఉన్నతాధికారులు ఈవిషయమై సీరియస్‌గా పరిగణించడంతో అటవీశాఖ, పోలీసు అధికారులు ముమ్మర దర్యాప్తు చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. నిందితులను విచారణ నిమిత్తం కస్టడీకీ అప్పగించాలని అటవీశాఖ అధికారులు పిటిషన్‌ వేయడంతో కోర్టు అంగీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అటవీశాఖ అధికారులు ఐదుగురు నిందితులతోపాటు మరో ఇద్దరు అనుమానితులతో దిగువమెట్ట సమీపంలోని అటవీ కార్యాలయానికి తీసుకువచ్చారు. శనివారం విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకరైన రాచర్ల మండలం చోళ్లవీడు గ్రామానికి చెందిన రంగస్వామి కార్యాలయంలోని కిటికీ అద్దాలను చేతితో పగులగొట్టాడు. పగిలిన అద్దం ముక్కలతో అధికారులు నివారించేందుకు ప్రయత్నిస్తుండగానే చేతిలో, పొట్టపై పొడుచుకొని తీవ్రంగా గాయపరచుకున్నాడు. దీంతో అధికారులు నివ్వెరపోయారు. వెంటనే తేరుకుని రంగస్వామిని పట్టుకుని ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంటనే ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ వీరస్వామి గిద్దలూరు అర్బన్‌ సీఐ కె.సురే్‌షకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Aug 16 , 2026 | 11:14 PM