Share News

పెళ్లి చూపులకు వెళ్లొస్తుండగా ప్రమాదం

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:14 AM

కుటుంబంలోని యువతి పెళ్లిచూపుల కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని వెంగళాయపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్టు ఆటో డ్రైవర్‌ చెబుతున్నారు.

పెళ్లి చూపులకు వెళ్లొస్తుండగా ప్రమాదం

వెంగళాయపల్లిలో ఆటో బోల్తా

సీపీఐ నాయకుడు మృతి, ఆరుగురికి గాయాలు

ఐదుగురు వెళ్లాల్సిన ఆటోలో 13 మంది ప్రయాణం

అంతా కనిగిరి మండలం ఏరువారిపల్లివాసులు

కుక్క అడ్డురావడమే కారణమంటున్న డ్రైవర్‌

పీసీపల్లి/కనిగిరి, జూన్‌ 24 (ఆంధ్ర జ్యోతి) : కుటుంబంలోని యువతి పెళ్లిచూపుల కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని వెంగళాయపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్టు ఆటో డ్రైవర్‌ చెబుతున్నారు. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి మండలం ఏరువారిపల్లికి చెందిన ఆ మండల సీపీఐ కార్యదర్శి జీపీ రామారావు (48) తన మేనకోడలి పెళ్లిచూపుల నిమిత్తం ఏరువారిపల్లి నుంచి బంధుమిత్రులతో కలిసి పామూరు మండలం కుంటకాడిఅయ్యవారిపల్లికి వెళ్లారు. అక్కడ పెళ్లిచూపులు ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఐదుగురు పరిమితితో వెళ్లాల్సిన ఆటో 13 మందితో వేగంగా వెళుతూ వెంగళాయపల్లికి వచ్చేసరికి అదుపు తప్పి రోడ్డు పక్కకెళ్లి తిరగబడింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ పక్కనే కూర్చుని ఉన్న జిపి.రామారావుతోపాటు అందులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన రామారావుకు సీపీఆర్‌ చేశారు. ఆయన అపస్మారక స్థితిలోకెళ్లారు. రామారావుతోపాటు గాయపడిన విజయమ్మ, వెంకటసుబ్బయ్య, సుబ్బమ్మ, అంకిత, వైదేహి, పద్మలను హుటాహుటిన పీసీపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రామారావు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కనిగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతిచెందారు. గాయపడిన ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం కందుకూరు వైద్యశాలకు తరలించారు. అకస్మాత్తుగా వచ్చిన కుక్కను తప్పించబోవడంతో ప్రమాదం చోటుచేసుకుందని ఆటో డ్రైవర్‌ చెప్తున్నాడు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతోపాటు ఆటో వేగంగా రావడంతోనే అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు అంటున్నారు.

Updated Date - Jun 25 , 2026 | 03:14 AM