ఏసీబీ దూకుడు
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:51 AM
అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో 10 రోజుల వ్యవధిలో ముగ్గురిని ఏసీబీ అరెస్టు చేసింది. ప్రధానంగా కీలకమైన శాఖలపై దృష్టిసా రించినట్లు సమాచారం.
10 రోజుల్లో ముగ్గురు అరెస్టు
అవినీతి అధికారుల గుండెల్లో గుబులు
ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో 10 రోజుల వ్యవధిలో ముగ్గురిని ఏసీబీ అరెస్టు చేసింది. ప్రధానంగా కీలకమైన శాఖలపై దృష్టిసా రించినట్లు సమాచారం. గతనెల 30న దర్శి మునిసిపల్ కమిషనర్ మహేశ్వరరావు నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే నర్సరావుపేట తదితర ప్రాంతాలలో ఆయనకు సంబంధించిన ఇళ్లలో సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించి ఆయన్ను అరెస్టు చేశారు. ఈనెల 6న ఒంగోలు గనుల శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సర్వేయర్‌గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసు కున్నారు.విజయవాడ, గుంటూరు మార్కాపురం, కనిగిరిలోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఆసిఫ్‌ను అరెస్టు చేశారు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన పలువురు
కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న జంగా సంపత్‌కుమార్ సోమవారం తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి రూ.55వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నెల క్రితం పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తన కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయన జిల్లా వాసి కావడం గమనార్హం. రెండు నెలల క్రితం ఒంగోలు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అఽధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న ఎవరో నగదును బయటకు విసిరేసిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఆ మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ముఖ్యమైన శాఖలపై అవినీతి నిరోధక శాఖ కన్నేసింది.
వరుస దాడులతో వణుకు
వరుస దాడులతో అక్రమార్కుల గుండెల్లో ఏసీబీ వణుకు పుట్టిస్తోంది. దీంతో కొంతమంది అధికారులు కార్యాలయాల్లో సీట్లలో కూర్చోకుండా క్యాంపుల పేరుతో బయటకు వెళుతున్నారు. వసూల్ రాజాలు కాస్త వెనక్కు తగ్గారు. జిల్లాలో వరుసగా అక్రమాస్తులపై అవినీతి నిరోధక శాఖ దాడులు, నేరుగా లంచం తీసుకుంటూ పలువురు పట్టుబడటం అంతటా చర్చనీయాంశమైంది. రెవెన్యూ కార్యాలయాలతోపాటుగా పోలీసు శాఖలో కూడా ఏసీబీ కలకలం మొదలైంది.