ప్రకాశం పోలీసుకు ఏబీసీడీ అవార్డు
ABN , Publish Date - Mar 14 , 2026 | 02:54 AM
మాయమాటలు చెప్పి బాలికను వెంట తీసుకెళ్లి సామూహిక హత్యాచారానికి పాల్పడిన ఘటన ఏడాదిన్నర తర్వాత వెలుగుచూసింది. పలు సాంకేతిక పద్ధతులు, ఇతర ఆధారాలతో పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్టు చేశారు.
డీజీపీ చేతులమీదుగా అందుకున్న ఎస్పీ
ఏడాదిన్నర తర్వాత హత్యాచారం కేసు ఛేదన
తొలుత అనుమానాస్పద మృతి
లోతైన దర్యాప్తుతో వెలుగు చూసిన దారుణం
ఒంగోలు క్రైం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మాయమాటలు చెప్పి బాలికను వెంట తీసుకెళ్లి సామూహిక హత్యాచారానికి పాల్పడిన ఘటన ఏడాదిన్నర తర్వాత వెలుగుచూసింది. పలు సాంకేతిక పద్ధతులు, ఇతర ఆధారాలతో పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్టు చేశారు. ఆ ప్రత్యేక కేసు ఏబీసీడీ అవార్డుకు ఎంపికైంది. మంగళగిరిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా చేతులమీదుగా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆ అవార్డును అందుకున్నారు. మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు పరిధిలోని ఓ లేఅవుట్ సమీపంలో 2024 జూలై 6న గుర్తుతెలియని మృతదేహం కుళ్లిన పరిస్థితిలో పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకేసుగా మార్పు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన కేసుల విచారణలో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో సింగరాయకొండకు చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని గుర్తించారు. లోతుగా విచారణ చేపట్టగా డిసెంబరు 30న ఆ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసును ఏడాదిన్నర తరువాత అప్పటి ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్‌బాబు నేతృత్వంలో ఛేదించారు. అందుకు సంబంధించి గత ఏడాది అక్టోబరు - డిసెంబరు క్వార్టర్‌కుగాను మద్ది పాడు పోలీసు స్టేషన్‌లో జరిగిన మర్డర్ కేసు దర్యాప్తు విషయంలో ప్రకాశం పోలీసులు ప్రథ మస్థానంలో నిలిచారు. ఈ మేరకు ఏబీసీడీ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కేసు విచారణలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని, అధికా రులను డీజీపీ అభినందించారు. కార్యక్రమలో సీఐడీ అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్టత్రిపాఠి, ప్రకాశం జిల్లా పోలీసులు పాల్గొన్నారు.