రోడ్డు ప్రమాదంలో వలపర్ల యువకుడు మృతి
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:09 PM
మార్టూరు, మండల పరిధిలోని వలపర్ల గ్రామానికి చెందిన షేక్ ఖాజావలి(30) అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
మార్టూరు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని వలపర్ల గ్రామానికి చెందిన షేక్ ఖాజావలి(30) అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్లే జాతీయరహదారిపై గణపవరం, తిమ్మాపురం గ్రామాల మధ్య అతను బైక్ మీద వెళ్తూ డివైడర్‌ను ఢీకొనడంతో మృతి చెందారు. అతనికి భార్య, ఐదేళ్ల బాబు, మూడేళ్ల పాప ఉన్నారు. గ్రామంలో టీ అమ్ముకుంటూ జీవనం సాగించే ఖాజావలి టీ పొడి కోసం ద్విచక్రవాహనంపై గుంటూరు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని చిలకలూరిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇన్‌స్పెక్షన్ రైలు ఢీకొని వృద్ధుడు మృతి
హరిప్రసాద్‌నగర్(చీరాల), ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి) : ఇన్‌స్పెక్షన్ రైలు ఢీకొని వృద్ధుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలోని రైలు గేటు వద్ద చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక హరిప్రసాద్‌నగర్‌కు చెందిన వల్లెపు ఆనందరావు(64) అనారోగ్యం కారణంగా సుమారు 20 ఏళ్ల క్రితం ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆర్వోబీ వంతెన కింద భార్యతో కలిసి టిఫిన్ బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా చూడకుండా రైలు పట్టాలు దాటుతుండటంతో విజయవాడ నుంచి ఒంగోలు వైపు వెళుతున్న ఇన్‌స్పెక్షన్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ మృతదేహానికి ఏరియా వైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రైలు ఎక్కుతూ వ్యక్తి మృతి
మార్టూరు, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలో బొబ్బేపల్లికి చెందిన ఎంఆర్‌పీఎస్ నేత గొల్లమూడి సాయిబాబు(50) మంగళవారం సికింద్రాబాదు రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తూ రైలు కింద జారి పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గత ఏడాది నుంచి భార్యతో హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. మంగళవారం మృతుడు బొబ్బేపల్లి గ్రామానికి రావడానికి రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా, ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.