Share News

తాత్కాలిక పరిష్కారం..!

ABN , Publish Date - Sep 08 , 2026 | 10:48 PM

అద్దంకిలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ జటిలం అవుతోంది. ప్రధానంగా భవానీసెంటర్‌ ఐదు రోడ్ల కూడలి కావటంతో తరచూ ట్రాఫిక్‌ నిలిచిపోతుంటుంది. దీంతో నామ్‌ రోడ్డులో దూర ప్రాంతం వెళ్లే వాహనచోదకులు కూడా ఇబ్బంది పడుతున్నారు.

తాత్కాలిక పరిష్కారం..!
పట్టణంలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉన్న భవనాసి లోలెవల్‌ కాలువ

భవనాసి కాలువ కట్టల అభివృద్ధితో అద్దంకిలో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

మినీ బైపా్‌సకు ప్రత్యామ్నాయం

తక్కువ ఖర్చుతో రాకపోకలకు సులువు

అద్దంకి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి) : అద్దంకిలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ జటిలం అవుతోంది. ప్రధానంగా భవానీసెంటర్‌ ఐదు రోడ్ల కూడలి కావటంతో తరచూ ట్రాఫిక్‌ నిలిచిపోతుంటుంది. దీంతో నామ్‌ రోడ్డులో దూర ప్రాంతం వెళ్లే వాహనచోదకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాలలో గంటల కొద్ది వేచి ఉండాల్సిన పరిస్థితులు తరచూ ఏర్పడుతున్నాయి. ప్రత్యామ్నాయంగా ఇప్పటికే అద్దంకి మేజర్‌ కాలువ కట్టను మినీ బైపాస్‌ రోడ్డుగా ఏర్పాటు చేసే పనులు పట్టాలెక్కుతున్నాయి. మినీ బైపాస్‌ రోడ్డులో గుండా నామ్‌ రోడ్డుకు తూర్పు వైపు కొత్తగా అభివృద్ధి చెందిన కాలనీలతో పాటు నామ్‌ రోడ్డులో వచ్చే ద్విచక్ర వాహనాలు, కార్లు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది.

నామ్‌ రోడ్డుకు పడమర వైపు ప్రాంతాలకు ఉపశమనం

నామ్‌ రోడ్డుకు పడమర వైపు అద్దంకి పట్టణంలో ఎక్కువ ప్రాంతాలు విస్తరించి ఉండటంతో ఆయా ప్రాంతాల నుంచి అద్దంకి పట్టణంలో దర్శి వైపు, శింగరకొండ వైపు వెళ్లాలంటే కచ్చితంగా భవానీసెంటర్‌లో గుండా ప్రయాణించాల్సిందే. ప్రత్యామ్నాయంగా భవనాసి కాలువ కట్టలను నర్రావారిపాలెం నుంచి ఊరచెరువు వరకు అభివృద్ధి చేసి నామ్‌ రోడ్డుకు అనుసంధానిస్తే భవానీసెంటర్‌లో ట్రాఫిక్‌ సమస్యను కొంత మేర తగ్గించే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు. నర్రావారిపాలెం, గాంధీబొమ్మ సెంటర్‌, గుంజివారిపాలెం, ఇందిరానగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు సలువుగా దర్శి రోడ్డు, నామ్‌ రోడ్డులకు చేరుకునే అవకాశం ఉంటుంది.


కాలువ రెండు వైపులా కట్టలు అభివృద్ధి చేయాలి

భవనాసి కాలువ రెండు వైపులా కట్టలను మెటల్‌ రోడ్లుగా అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతోనే రవాణా వసతి కల్పించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో నామ్‌ రోడ్డును అద్దంకి పట్టణంలో గుండా కాకుండా బైపాస్‌ ప్రతిపాదన వచ్చిన సమయంలో కూడా గోపాలపురం వద్ద నుంచి భవనాసి కాలువ సమీపంలోనే ఏర్పాటు చేసే ప్రతిపాదన వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం బైపాస్‌ రోడ్డు ఏర్పాటు సాధ్యం అయ్యే పరిస్థితి లేనందున కనీసం ప్రత్యామ్నాయ రహదారి గానైనా అభివృద్ధి చేయాలని అద్దంకి పట్టణ వాసులు కోరుతున్నారు.

Updated Date - Sep 08 , 2026 | 10:48 PM