చివరి రోజు జోరు
ABN , Publish Date - Oct 24 , 2026 | 01:54 AM
పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు ఇటు జిల్లా పరిషత్ ప్రాదేశికాలు (జడ్పీటీసీలు), అటు మండల పరిషత్ ప్రాదేశికాల (ఎంపీటీసీల)కు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
ముగిసిన పరిషత్ నామినేషన్లు
ఉత్సాహంగా దాఖలు చేసిన టీడీపీ శ్రేణులు
టంగుటూరులో పాల్గొన్న మంత్రి స్వామి, సత్య
నేడు పరిశీలన... రే పు అప్పీళ్లపై విచారణ
కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
పలు సెంటర్‌లను సందర్శించిన ఎస్పీ
వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించిన కలెక్టర్, జేసీ
ఒంగోలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు ఇటు జిల్లా పరిషత్ ప్రాదేశికాలు (జడ్పీటీసీలు), అటు మండల పరిషత్ ప్రాదేశికాల (ఎంపీటీసీల)కు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో 27 జడ్పీటీసీలు, 27 మండలాల్లోని 373 ఎంపీటీసీల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 21 నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. జడ్పీటీసీలకు తొలిరోజు 13, రెండో రోజు 92, అలాగే ఎంపీటీసీలకు తొలిరోజు 140, రెండో రోజు 804 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం అంతకు రెట్టింపు సంఖ్యలో అందాయి. చాలాచోట్ల వైసీపీ వర్గీయులు నామినేషన్లకు అంతగా ఆసక్తిచూపకపోగా టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. కొన్ని మండలాల్లో టీడీపీ, కూటమి అభ్యర్థులపై స్పష్టత రాగా అలాంటి చోట్ల అధికారికంగా ఖరారైన వారు, వారి తరఫున డమ్మీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఖరారు కాని చోట్ల టికెట్లు ఆశిస్తున్న వారంతా దాఖలు చేశారు.
టంగుటూరు, ఎస్‌ఎన్‌పాడులో భారీ ర్యాలీలు
పలుగ్రామాల నుంచి మండ ల కేంద్రాలకు పెద్దసం ఖ్యలో మద్దతుదారులతో టీడీపీ అభ్యర్థులు తరలి వచ్చి ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. ఈ సంద ర్భంగా కొన్నిచోట్ల ర్యాలీలు కూడా నిర్వహించగా కీలక నేతలు పాల్గొన్నారు. టంగుటూరులో ఆ మండలంలోని టీడీపీ అభ్యర్థులంతా ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేయగా మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. అనంతరం కొండపి, పొన్నలూరులలో జరిగిన ర్యాలీల్లోనూ సత్య పాల్గొని అభ్యర్థులు, పార్టీశ్రేణులను ఉత్సాహపరిచారు. సంతనూతలపాడులో టీడీపీ తరఫున ఎంపీపీ పదవిని ఆశిస్తున్న విక్రమ్ తారాబాయి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అక్కడి ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ పాల్గొన్నారు. అద్దంకి, పలు ఇతరచోట్ల కూడా తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
యంత్రాంగం ప్రత్యేక దృష్టి
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరి రాష్ట్రంలో కొన్నిచోట్ల తిరిగి నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఎస్‌ఈసీ పరిషత్ నామి నేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. తదనుగుణంగా ఒకవైపు జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ రాజాబాబు, మరోవైపు ఎస్పీ హర్షవర్ధన్‌రాజులు చివరి రోజున మరింత అప్రమత్తంగా పర్యవేక్షించారు. ఒంగోలులో జడ్పీటీసీల నామినేషన్లతోపాటు వివిధ మండలాల్లో ఎంపీటీసీల నామినేషన్ల దాఖలును వెబ్‌కాస్టింగ్ ద్వారా కలెక్టర్, జేసీ కల్పనాకుమారి ఒంగోలులోని కలెక్టరేట్ నుంచి పరిశీలించారు. ఆయా మండలాల అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు కందుకూరు, లింగసముద్రం, పొన్నలూరు, తాళ్లూరు, ముండ్లమూరు తదితర కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. ఇదిలాఉండగా పరిషత్ నామినేషన్లు శుక్రవారంతో ముగియగా శనివారం వాటిని అభ్యర్థుల సమక్షంలో అధికారులు పరిశీలించనున్నారు. వాటిపై ఆదివారం అప్పీల్‌కు అవకాశం ఉంది. అనంతరం 27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదేరోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.
చివర్లో భారీగా నామినేషన్లు
జిల్లాలోని 27 జడ్పీటీసీలకు చివరి రోజైన శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం రాత్రి ఏడు గంటల వరకూ కొనసాగింది. జిల్లాలో జడ్పీటీసీలకు 238 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటిరోజైన బుధవారం 13, గురువారం 92 నామినేషన్లు దాఖలు కాగా శుక్రవారం ఒక్కరోజే 120 అందాయి. తెలుగుదేశం పార్టీ 101, వైసీపీ 79, కాంగ్రెస్ 5, ఆప్ 3, బీఎస్పీ 3, బీజేపీ 3, సీపీఐ(ఎం) 3, జనసేన నుంచి 11, ఇతరులు 17మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే జిల్లాలో 373 ఎంపీటీసీలు ఉండగా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 1,977 రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 943మంది, వైసీపీ తరఫున 794 మంది, ఇతరులు 240 మంది నామినే షన్లు దాఖలు చేశారు.