Share News

రెప్పపాటు.. మృత్యుకాటు

ABN , Publish Date - Jul 23 , 2026 | 03:08 AM

బొలెరో వాహనాన్ని కారు ఢీకొన డంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గిద్దలూరు శివారులో బుధవారం చోటుచేసుకుంది.

రెప్పపాటు.. మృత్యుకాటు
కారులో నుంచి మృతదేహాన్ని బయటకు తీస్తున్న సీఐ సురేష్‌

బొలెరోను కారు ఢీకొని ఇద్దరు మృతి

ముగ్గురికి తీవ్రగాయాలు

గిద్దలూరు శివారులో ఘటన

కారులోని వారంతా నల్గొండ జిల్లా

మాల్‌ ప్రాంతానికి చెందిన వారు

శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం

గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : బొలెరో వాహనాన్ని కారు ఢీకొన డంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గిద్దలూరు శివారులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలోని పూలపల్లి రాంనగర్‌ గ్రామానికి చెందిన సిద్దగోని మహేష్‌, భార్య మానస, ఇద్దరు కుమారులతోపాటు స్నేహితుడైన ముద్దం శేఖర్‌ (26)తో కలిసి మూడు రోజుల క్రితం తీర్థయాత్రకు బయల్దేరారు. బుధవారం నంద్యాల జిల్లా మహానందికి చేరుకున్నారు. అక్కడ దైవదర్శనం అనంతరం గిద్దలూరు మీదుగా శ్రీశైలం వెళ్తున్నారు. కారును శేఖర్‌ నడుపుతున్నాడు. గిద్దలూరు శివారులో చాణక్య పాఠశాల వద్దకు వచ్చే సరికి వారి కారు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. రెప్పపాటులో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో కారు నడుపుతున్న శేఖర్‌, మహేష్‌ పెద్దకుమారుడు లలిత్‌సాగర్‌ (7) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న మహేష్‌, అతని భార్య మానస, చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న గిద్దలూరు అర్బన్‌ సీఐ కె.సురేష్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను, గాయపడ్డ వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చికెన్‌ షాపు నిర్వహిస్తున్న మహేష్‌ కుటుంబం

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్‌ దంపతులు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌ గ్రామంలో చికెన్‌ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఇరువురు కుమారులు. మాల్‌ సమీపంలోనే పూలపల్లి రాంనగర్‌ గ్రామంలో నివాసం ఉంటున్నారు. మహేష్‌ స్నేహితుడైన ముద్దం శేఖర్‌.. మాల్‌ గ్రామంలోనే వీడియో గ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. శేఖర్‌కు డ్రైవర్‌గా కూడా అనుభవం ఉంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరిన విషాదం నింపింది.

Updated Date - Jul 23 , 2026 | 03:08 AM