Share News

చెత్త సమస్యకు పరిష్కారం

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:27 AM

పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త నిల్వలను తొలగించే దిశగా లెగసీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (పాత వ్యర్థాల నిర్వహణ) కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. స్వచ్ఛభారత్‌ 2.0లో భాగంగా మునిసిపాలిటీల్లో దీన్ని అమలు చేస్తున్నారు.

చెత్త సమస్యకు పరిష్కారం
చెత్తను రీసైక్లింగ్‌ చేస్తున్న మిషన్‌

లెగసీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విజయవంతం

స్వచ్ఛ భారత్‌ 2.0 ద్వారా డంపింగ్‌ యార్డుల శుభ్రత

పర్యావరణం విషపూరితం కాకుండా చర్యలు

చెత్తను రీసైక్లింగ్‌ చేస్తున్న బయో మైనింగ్‌ మిషన్లు

మార్కాపురం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త నిల్వలను తొలగించే దిశగా లెగసీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (పాత వ్యర్థాల నిర్వహణ) కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. స్వచ్ఛభారత్‌ 2.0లో భాగంగా మునిసిపాలిటీల్లో దీన్ని అమలు చేస్తున్నారు. మార్కాపురంలో వేగవంతంగా జరుగుతోంది. డంపింగ్‌ యార్డుల్లో చెత్త నిల్వలు పేరుకుపోయి వాటి నుంచి వెలువడే గ్యాస్‌ ద్వారా వాతావరణం కలుషితమవడం, వర్షాల వల్ల కరిగిన వ్యర్థాలు భూమిలోకి ఇంకి విషపూరితం కావడం లాంటి వాటికి చెక్‌ పెడుతున్నారు. దరిమడుగు సమీపంలో ఉన్న డంపింగ్‌ యార్డులోని చెత్తను బయో మైనింగ్‌ మిషన్‌ ద్వారా రీసైక్లింగ్‌ చేస్తున్నారు. శాస్త్రీయ విధానంలో వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆస్కారం ఏర్పడుతోంది. మునిసిపాలిటీలకు ఆదాయం కూడా సమకూరుతోంది. డంపింగ్‌ యార్డుల్లో ఎక్కువ కాలం పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా తొలగించే విధానమే లెగసీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌. ఇందులో కుళ్లిన పదార్థాలు, ప్లాస్టిక్‌, గాజు లోహాలు, ఇతర ప్రమాదకర రసాయనాలన్నీ కలిసి ఉంటాయి. అందుకే స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ద్వారా ఇళ్ల నుంచి చెత్తను సేకరించేటప్పుడే తడి, పొడివి వేరుచేసి తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. సేకరించిన చెత్తను పట్టణాల వెలుపల డంపింగ్‌ యార్డుల్లో ఏళ్ల తరబడి నిల్వ చేయడం వల్ల దాని నుంచి వెలువడే మిథేన్‌లాంటి విషవాయువులు గాలిని కలుషితం చేస్తాయి. వర్షాలు పడినప్పుడు చెత్తలోని కెమెకల్స్‌ భూమిలోకి ఇంకిపోతాయి. ఈ పరిస్థితులు ఉత్పన్నమై పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా బయో మైనింగ్‌ మిషన్‌లతో చెత్త నిల్వలను రీసైక్లింగ్‌ చేస్తున్నారు. మార్కాపురంలో 2025 జూన్‌ 16 నుంచి జులై 2 వరకు మొదటి విడత నిర్వహణ ద్వారా కొంతభాగం చెత్తను రీసైక్లింగ్‌ చేశారు. మళ్లీ ఇప్పుడు రెండో విడత 2026 జనవరి 28 నుంచి కొనసాగుతోంది.

మూడు రకాల పదార్థాలుగా వేరు

డంపింగ్‌ యార్డ్‌లో ఉన్న చెత్తను రీసైక్లింగ్‌ ద్వారా మూడు రకాల పదార్థాలుగా వేరు చేస్తారు. అందులో మొదట.. మండించగలిగే ప్లాస్టిక్‌, వస్త్రాలు, ఇతర వస్తువుల నుంచి తీసిన పదార్థాన్ని ఆర్‌డీఎఫ్‌ అంటారు. దీనిని మొదటి విడత ప్రాసెసింగ్‌లో 75.78 మెట్రిక్‌ టన్నులు, రెండో విడతలో 243.9 మెట్రిక్‌ టన్నులు తయారు చేశారు. దీనిని సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో ఇంధనంగా వాడతారు. రెండోదిగా వచ్చే పదార్థాన్ని ఇనర్ట్స్‌ అంటారు. ఇది ఇసుక, సిమెంట్‌రాళ్లు, ఏళ్లతరబడి పేరుకున్న ధూళి, డ్రైనేజీల ద్వారా ఏర్పడిన ఒండ్రుమట్టి వంటి వాటి ద్వారా తయారవుతుంది. ఇవి పర్యావరణానికి హాని కావు కనుక రోడ్ల నిర్మాణానికి, పార్కుల్లో చెట్ల పెంపకం, లోతట్టు ప్రాంతాల్లో మెరకలకు ఉపయోగిస్తారు. మొదటి విడతలో 4,148.38 మెట్రిక్‌ టన్నులు, రెండో విడతలో ఇప్పటికి 818.45 మెట్రిక్‌ టన్నుల ఇన్నర్ట్స్‌ని ఉత్పత్తి చేశారు. మూడో పదార్థం ప్రధానమైనది. దీనిని బయోసాయిల్‌ అంటారు. డంపింగ్‌ యార్డుల్లో ఉన్న ఆహార వ్యర్థాలు, ఆకులు, ఇతర సేంద్రియ వ్యర్థాలన్నీ ఏళ్ల తరబడి నిల్వ ఉండడం వల్ల ముదురు రంగులోకి మారి మట్టిపదార్థంగా తయారవుతుంది. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే పోషకాలను కలిగి ఉంటుంది. దీనిని పట్టణాల్లో డివైడర్‌ల మధ్య పెంచే మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. లెగసీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా మార్కాపురంలో మొదటి విడత 22,238.57 మెట్రిక్‌ టన్నులు, రెండో విడత మార్చి 31వరకు 2057.5 మెట్రిక్‌ టన్నుల బయోసాయిల్‌ ఉత్పత్తయింది.

త్వరలో షెడ్స్‌ ఏర్పాటు

భవిష్యత్‌లో చెత్తనిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు రీసైక్లింగ్‌ చేసేందుకు గుంటూరు జవహర్‌ ఆటో మొబైల్స్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని అన్ని మునిసిపాలిటీల్లో ఈ ఆటోమొబైల్స్‌ ఆధ్వర్యంలో రెండు షెడ్‌లను ఏర్పాటు చేస్తారు. పట్టణాల్లోని చెత్తను తీసుకెళ్లిన వాహనాల్లోని తడి, పొడి చెత్తను వేరువేరుగా షెడ్‌లలో నింపుకొని రీసైక్లింగ్‌ చేసుకుని అవసరమైన పదార్థాన్ని వినియోగించుకుంటారు. అయితే చెత్తను తరలించినందుకు మునిసిపాలిటీకి టిప్పింగ్‌ చార్జీకింద టన్నుకు కొంత మొత్తాన్ని వీరు చెల్లిస్తారు. ఈ షెడ్ల నిర్మాణం కోసం ఇప్పటికే స్థల సేకరణ పూర్తి అయింది. ఏప్రిల్‌ 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 01:27 AM