సీఎస్‌గా జిల్లా వాసి
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:14 AM
రాష్ట్రప్రభుత్వంలో పాలనా యంత్రాంగాన్ని నడిపించే అత్యున్నత స్థాయి పదవీ బాధ్యతలు జిల్లాకు చెందిన అధికారికి దక్కాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి గుట్లపల్లి సాయి ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో సాయిప్రసాద్ నియమితులయ్యారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్
ఈ ఏడాది ఆగస్టు వరకు సర్వీసు
గతంలో పనిచేసిన ఐవీఆర్
ఒంగోలు, ఫిబ్రవరి 28 (ఆంరఽధజ్యోతి) : రాష్ట్రప్రభుత్వంలో పాలనా యంత్రాంగాన్ని నడిపించే అత్యున్నత స్థాయి పదవీ బాధ్యతలు జిల్లాకు చెందిన అధికారికి దక్కాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి గుట్లపల్లి సాయి ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో సాయిప్రసాద్ నియమితులయ్యారు. నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన సాయిప్రసాద్ ఎంటెక్ చదివి పాతికేళ్ల వయస్సులో 1991లో ఐఏఎస్ సాధించి రాష్ట్ర కేడర్ దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్‌లో సబ్‌కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పాడేరు సబ్‌కలెక్టర్‌గా, గుంటూరు కార్పొరేషన్ కమిషనర్‌గా, కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, చిత్తూరు. కర్నూలు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే రాష్ట్రస్థాయి బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువకాలం విద్యుత్ శాఖలో, సాగునీటి శాఖలో ఉన్నతస్థాయి బాధ్యతలను నిర్వహించారు. గతంలో 2014-19 మధ్య సీఎంగా చంద్రబాబునాయుడు పనిచేసిన కాలంలో కొంతకాలం ఆయనకు కార్యదర్శిగా, మరికొంత కాలం సీఎంవో ముఖ్యకార్యదర్శిగా కూడా పనిచేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో సీసీఎల్‌ఏగా, ఇంధన శాఖలో ముఖ్య హోదాల్లో పనిచేసిన సాయిప్రసాద్ తిరిగి చంద్రబాబు సీఎం అయ్యాక జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అదే హోదాలో సీఎం ఎక్స్ అఫిషియో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గత నవంబరు ఆఖరులోనే సీఎస్‌గా సాయిప్రసాద్ నియామకం జరగాల్సి ఉండగా అప్పటి సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మూడు మాసాలు పొడిగించింది. అదేసమయంలో మూడు మాసాల అనంతరం సాయిప్రసాద్‌ను సీఎస్‌గా నియమిస్తూ గతేడాది నవంబరు 29నే ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ ప్రకారం శనివారం ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఇదిలాఉండగా రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి తొలి సీఎస్‌గా జిల్లాకు చెందిన నాటి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న ఐవీఆర్ కృష్ణారావు పనిచేశారు. కొండపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం చౌటపాలెం ఆయన స్వగ్రామం. అలా తొలి సీఎస్‌గా కృష్ణారావు పనిచేయగా ఆ అత్యున్నత స్థానానికి జిల్లా నుంచి రెండో వ్యక్తిగా సాయిప్రసాద్‌కు అవకాశం దక్కింది.