Share News

వెలిగొండ జలాలతో కనిగిరి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:39 PM

వెలిగొండ జలాలతో కనిగిరి నీటి సమస్యకు శాశ్వతంగా చెక్‌ పడాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరిగేషన్‌శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

వెలిగొండ జలాలతో కనిగిరి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఎల్‌అండ్‌ సంస్థ అధికారులతో టిడ్కో ఇళ్ల పనుల పురోగతిని సమీక్షిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర

ఇరిగేషన్‌ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ జలాలతో కనిగిరి నీటి సమస్యకు శాశ్వతంగా చెక్‌ పడాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరిగేషన్‌శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లభించే జలాలను కనిగిరి నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికీ మళ్లించే విధంగా అధికారులు చొరవ వహించాలన్నారు. అదేవిధంగా ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. వెలిగొండలో నీటి లభ్యత, ప్రస్తుతం జరుగుతున్న నీటి వినియోగం, నియోజకవర్గానికి నీటిని మళ్లించే విధానం తదితర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమగ్రంగా చర్చించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు తాగు, సాగునీరు అందించటమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు.


నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

అదేవిధంగా పట్టణ సమీపంలోని చాకిరాల వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్మాణంలో పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత కాంట్రాక్ట్‌ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సిబ్బంది, అధికారులతో ఎమ్మెల్యే ఉగ్ర సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్తయిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు మూడు దశలుగా అందజేస్తామన్నారు. రానున్న దీపావళి నుంచి సంక్రాంతి పండుగలోపు ఇళ్లను అప్పగించి లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూడటమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీధర్‌, నాయకులు ఫిరోజ్‌, సానికొమ్ము విజయభాస్కర్‌రెడ్డి, గండికోట రమేష్‌, సద్గురు, షరీఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 11:39 PM