నూతన సందడి
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:30 AM
జిల్లాలో నూతన సందడి నెలకొంది. కొత్త సంవత్సర వేడుకలతోపాటు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటైంది. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో కలిశాయి. ఈ సందర్భంగా అన్నిచోట్లా నూతనోత్సాహం నెలకొంది.
జిల్లావ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నివాసాలు కిటకిట
పశ్చిమప్రాంతంలో వేడుకలపై జిల్లా ఏర్పాటు ప్రభావం
దేవాలయాలు, చర్చిలు, ఇతర ప్రార్థన ప్రాంతాల్లో రద్దీ
జిల్లా అంతటా నూతన సంవత్సర వేడుకలను వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా జరుపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే అత్యధిక ప్రాంతాల్లో ప్రత్యేకించి పట్టణాల్లో సందడి, సందడిగా వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువారం మరింత జోష్‌తో సాగాయి. ఉదయం నుంచి పల్లె, పట్టణం తేడా లేకుండా అన్నిచోట్లా దేవాలయాలు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలు రద్దీగా కనిపించాయి. పెద్దసంఖ్యలో ప్రజానీకం ఈ సందర్భంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీల నేతల ఇళ్లు, కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాసాలు, ఆఫీసుల్లో కోలాహలం నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అందరిలో నూతనోత్సాహం కనిపించింది.
ఒంగోలు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నూతన సందడి నెలకొంది. కొత్త సంవత్సర వేడుకలతోపాటు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటైంది. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో కలిశాయి. ఈ సందర్భంగా అన్నిచోట్లా నూతనోత్సాహం నెలకొంది. కీలక ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలు, ప్రధానమైన అధికారుల వద్దకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా వారి అనుచరులు, అభిమానులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రతినిధుల రాకతో ఆ ప్రాంతాలు కిటకిటలాడాయి. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తూర్పునాయుడుపాలెంలోని తన నివాసం వద్ద వేడుకలు జరుపుకొన్నారు. బుధవారం అర్థరాత్రి నియోజకవర్గ నేతల సమక్షంలో న్యూఇయర్ కేక్‌ను ఆయన కట్ చేశారు. గురువారం నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన టీడీపీ శ్రేణులు, కూటమి నేతలు, జిల్లా అధికారులు భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
సందడిగా నేతల ఇళ్లు
ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయ్‌కుమార్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒడా చైర్మన్ షేక్ రియాజ్ తదితర నేతల ఇళ్లు, కార్యాలయాల వద్ద ఘనంగా వేడుకలు జరిగాయి. కలెక్టర్ రాజాబాబు, ఎస్సీ హర్షవర్ధన్‌రాజుల బంగ్లాల్లోనూ ఉత్సాహంగా కొనసాగాయి. అద్దంకి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుటుంబ సభ్యులతో ఇతర ప్రాంతాల్లో ఉండగా నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నేతలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి శింగరకొండ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఇక కందుకూరు నియోజకవర్గంలోనూ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కార్యాలయం వద్ద సందడి నెలకొంది. టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తన కార్యాలయం వద్ద వేడుకల్లో పాల్గొనగా భారీగా పార్టీశ్రేణులు, స్థానిక అధికారులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమప్రాంతంలో వేడుకలపై నూతన జిల్లా ఏర్పాటు ప్రభావం కనిపించింది. పలుచోట్ల న్యూ ఇయర్ గ్రీటింగ్‌ను నూతన జిల్లా అంశంతో రూపొందించి పంచుకున్నారు. ఎమ్మెల్యేల కార్యాలయాలు, ఇళ్ల వద్ద జోష్ నెలకొంది. ఇతర అన్నిచోట్లా ఉత్సాహంగా వేడుకలు జరిగాయి.