తుఫాన్‌కు తలొంచని ప్రకృతి పంట
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:27 AM
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పీఎండీఎస్, ఘన, ద్రవ, జీవామృతాల కషాయాలు వాడిన పంటలు ఇటీవల సంభవించిన తుఫాన్ తీవ్రతకు తట్టుకొని నిలబడ్డాయి. అదేసమయంలో పురుగుమందులు, రసాయన ఎరువులు వాడిన పంట పొలాలు నేలమట్టమయ్యాయి.
పెనుగాలులు, వర్షానికి తట్టుకొన్న మిరప, వరి
నేలకొరిగిన రసాయన పద్ధతిలో సాగు చేసిన పైర్లు
ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు కనుకు బ్రహ్మారెడ్డి రెండు ఎకరాల్లో 555రకం మిరప సాగు చేశారు. మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపినప్పటికీ ఒక్క మొక్క కూడా నేలకొరగకుండా నిలబడింది. అదేగ్రామానికి చెందిన రైతు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి రసాయన పద్ధతిలో సాగు చేసిన తేజ రకం మిరప తోటలో సుమారు 40శాతం మొక్కలు నేలకొరిగాయి.
అద్దంకి మండలం చిన్నకొత్తపల్లిలో రైతు కె.అంజిరెడ్డి రసాయన పద్ధతిలో రెండు ఎకరాల్లో సాగు చేసిన 5,204 రకం వరి 70శాతం నేలమట్టమైంది. అదే గ్రామంలో రైతు ముచ్చిమూరి నరేంద్రరెడ్డి తన ఎకరం పొలంలో ప్రకృతి సేద్యం విధానంలో సాగు చేసిన వరి తుఫాన్ ప్రభావాన్ని తట్టుకొని ఠీవిగా నిలబడింది.
ఇలా.. ఒకే గ్రామాల్లో ఒకే పంట రకాన్ని, ఒకే విధమైన వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసినప్పటికీ తుఫాన్ ప్రభావంతో వీచిన పెనుగాలులను ప్రకృతి సేద్యం బలంగా ఎదుర్కొంది. రసాయన విధానంలో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. ప్రకృతి విధానంలో వేసిన పంటలకు సంబంధించిన నష్టం తక్కువగా ఉండగా, రసాయన వ్యవసాయ పంటలు 40 నుంచి 80శాతం వరకూ తుడిచిపెట్టుకుపోయాయి.
ముండ్లమూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పీఎండీఎస్, ఘన, ద్రవ, జీవామృతాల కషాయాలు వాడిన పంటలు ఇటీవల సంభవించిన తుఫాన్ తీవ్రతకు తట్టుకొని నిలబడ్డాయి. అదేసమయంలో పురుగుమందులు, రసాయన ఎరువులు వాడిన పంట పొలాలు నేలమట్టమయ్యాయి. ఈనెల 3న మురసు తుఫాన్ ప్రభావంతో గంటకు 100-110కి.మీ వేగంతో పెనుగాలులు వీచాయి. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. అయితే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన మిర్చి, వరి తుఫాన్ ప్రభావాన్ని తట్టుకొని నిలకడగా ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం, రసాయన వ్యవసాయ క్షేత్రాల మధ్య పంటల విష యంలో స్పష్టమైన వ్యత్యాసం క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైందని ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ద్రవ జీవామృతం, ఘన. జీవామృతం, పంటల వైవిద్యాన్ని ప్రోత్సహించే పీఎంజీఎస్ వంటి పద్ధతుల ద్వారా నేల ఆరోగ్యాన్ని, పంటల ఆరోగ్యం మెరుగుపడిందని ఆమె చెప్పారు. ఈ పద్ధతులు పంటల స్థిరత్వాన్ని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని ఆమె చెప్పారు. వాతావరణ మార్పులు, తుఫాన్లు, భారీ వర్షాలు, వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న తరుణంలో ముండ్లమూరు, అద్దంకి మండలాలలోని ఈ క్షేత్రస్థాయి ఉదాహరణలు ప్రకృతి వ్యవసాయ పంటల నిలకడను చాటిచెబుతున్నాయి. రైతులకు పంట నష్టాలను తగ్గించుకునే స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రకృతి వ్యవసాయంపై మరింత నమ్మకాన్ని, భరోసాను కల్పిస్తున్నాయి.