Share News

ఉవ్వెత్తున నిరసన గళం

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:36 PM

ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, లేబర్‌ కోడ్స్‌ రద్దు కోరుతూ గురువారం జిల్లాలోని కార్మికులు, ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె విజయవంతమైంది.

ఉవ్వెత్తున నిరసన గళం
మార్కాపురంలోని కంభం సెంటరులో మానవహారంగా ఏర్పడిన కార్మికులు

కదంతొక్కిన కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు

మార్కాపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలు, మానవహారాలు

లేబర్‌ కోడ్స్‌ రద్దే లక్ష్యం అంటూ నినాదాలు

విజయవంతమైన సార్వత్రిక సమ్మె

మార్కాపురం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, లేబర్‌ కోడ్స్‌ రద్దు కోరుతూ గురువారం జిల్లాలోని కార్మికులు, ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రమైన మార్కాపురంతోపాటు గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెంలలో కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. అనేక ప్రాంతాల్లో ర్యాలీలు నిరసన ప్రదర్శనలు చేస్తూ నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, పాత చట్టాలను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. కొన్నిచోట్ల మానవహారంగా ఏర్పడినచోట పలువురు వక్తలు ప్రసంగించి నూతన చట్టాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్న ప్రదర్శనల్లో అంగన్‌వాడీ వర్కర్‌లు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన వర్కర్లు, వీఆర్‌ఏలు, 108 ఉద్యోగులు, మున్సిపల్‌ కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ఇతర కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:36 PM