Share News

కొంచెం ఊరట

ABN , Publish Date - Feb 07 , 2026 | 02:37 AM

ఉపాధి హామీ మెటీరియల్‌ కోటా నిధుల సద్వినియోగంపై డ్వామా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పనుల విషయంలో ఇటీవల కేంద్రం పెట్టిన ఆంక్షలను అధిగమించి అందుబాటులో ఉన్న నిధులు మురిగిపోకుండా చేసేలా చర్యలు చేపట్టారు.

కొంచెం ఊరట

‘ఉపాధి’ మెటీరియల్‌ కోటా సద్వినియోగంపై కసరత్తు

పదికి బదులు ఇరవై పనుల వరకు కేంద్రం అనుమతి

అవసరం లేని అసంపూర్తివి క్లోజ్‌

ప్రారంభం కానివి పూర్తిగా రద్దు

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 35వేల పనులు తొలగింపు

డ్వామా సిబ్బంది పర్యవేక్షణలో చేసే వాటి హేతుబద్ధీకరణ

ఉపాధి హామీ మెటీరియల్‌ కోటా నిధుల సద్వినియోగంపై డ్వామా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పనుల విషయంలో ఇటీవల కేంద్రం పెట్టిన ఆంక్షలను అధిగమించి అందుబాటులో ఉన్న నిధులు మురిగిపోకుండా చేసేలా చర్యలు చేపట్టారు. గతంలో ఒక గ్రామ పరిధిలో ఎన్ని పనులైనా మంజూరు చేసేవారు. వాటిలో కొన్ని పూర్తికాకపోయినా, అసలు ప్రారంభించకపోయినా కొత్తవి మంజూరు చేసే అవకాశం ఉండేది. అలాంటిది కేంద్రం ఇటీవల ఒక గ్రామంలో పది పనులు జరుగుతుంటే అదనంగా మంజూరు చేయవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొంది. దీంతో అధికారులు అసలు ప్రారంభం కానివి, అవసరం లేని అసంపూర్తి పనులను రద్దు చేశారు. అవసరమైన చోట తిరిగి కొత్తవి మంజూరు చేయనున్నారు. అలాగే కేంద్రం కూడా ఆంక్షలను సడలిస్తూ పది కాకుండా 20కి అనుమతివ్వడం కొంత ఊరటనిచ్చింది.

ఒంగోలు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా కింద ఈ ఏడా ది సుమారు రూ.65 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 178 గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్‌లు, ఇతర పనులు పక్షంరోజుల క్రితం మంజూరు చేశారు. పనులు చేపట్టబోయే సమయానికి పదికి మించి జరుగు తున్న గ్రామాల్లో కొత్తవి చేసేందుకు కేంద్రం రూ పొందించిన కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ అంగీకరించ లేదు. అలా ఆ పనులకు ఆటంకం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి అంతటా తలెత్తడంతో అన్ని రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో పదికి బదులు 20 పనుల వరకు అనుమతించారు. అంటే ఒక గ్రామంలో ఉపాధి పథకం కింద చిన్న, పెద్ద ఏదైనా 20 పనులలోపు చేయవచ్చు. అలాంటి గ్రామాల్లో తాజాగా మెటీరియల్‌ కోటా కింద కొత్తగా మంజూరుకు అవకాశం కలిగింది. ఆ వెసులుబాటుతో గతంలో మంజూరు చేసిన పనులను డ్వామా అధికారులు పరిశీలిస్తు న్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో పనులు మంజూరైన విషయాన్ని గుర్తించారు.

దాదాపు 55వేల పనులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55వేల పనులు మంజూరై ఉన్నాయి. వాటిల్లోనూ రద్దు లేదా పురోగతిలో ఉన్న వాటిని క్లోజ్‌ అయినట్లు చూపడంపై దృష్టి సారించారు. తద్వారా కొత్త పనులు చేపట్టి మెటీరియల్‌ కోటా నిధులు వృథా కాకుండా సద్వినియోగం చేయాలన్నది అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, డ్వామా పరిధిలోని ఇతర సిబ్బందితో గురువారం ఒంగోలులో గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్‌ శివప్రసాద్‌, పీడీ జోసఫ్‌కుమార్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అందులోభాగంగా మంజూరై ప్రారంభం కాని 50వేల పనులను రద్దుచేయాలని నిర్ణయిం చారు. అలాగే పురోగతిలో ఉన్న వాటిలో కనీసం 30శాతం పని పూర్తయితే తదుపరి దానిని కొనసాగించకపోయినా ఇబ్బంది లేనిది అయితే వాటిని క్లోజ్‌ చేస్తున్నట్లు చూపించే అవకాశం ఉంది. దీంతో 30శాతంలోపు పని జరిగిన వాటిని గుర్తించి అవి 30శాతం మించాలంటే ఎంతమేర చేయాలో చేసి వాటిని క్లోజ్‌ చేయడం, అలాగే 30 నుంచి 60శాతం, 60శాతం నుంచి 100 శాతం లోపు వాటిని క్లోజ్‌ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. సుమారు 35వేల వరకు పనులను రద్దు చేయడం లేదా క్లోజ్‌ కేటగిరీలో చూపే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. తదనుగుణంగా చర్యలు చేపట్టారు. మరోవైపు డ్వామా సిబ్బంది నేరుగా పర్యవేక్షించే ఇంకుడు గుంతలు, పంట కుంటల తవ్వకాలు, మొక్కల పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణం వంటి పనులు తక్షణం పూర్తి లేదా క్లోజ్‌ చేయనున్నారు. అలాగే ముందుజాగ్రత్తగా కొన్ని మండలాల్లో స్థానికంగా చేసే అవకాశం ఉన్నదాని కన్నా మంజూరులు లేదా ప్రతిపాదనలు అధికంగా చేసిన వాటిని గుర్తించి జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారు. తద్వారా గ్రామాల్లో పనులు చేసే వెసులుబాటుతోపాటు వాటి కోసం కేటాయించిన నిధులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మొత్తం కసరత్తుతో 55వేల పనుల్లో 40వేలు వివిధ కేటగిరీల కింద రద్దు లేదా క్లోజ్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మిగిలిన 15వేల పనులు ఉమ్మడి జిల్లాలోని 729 గ్రామాల్లో ఉండగా ఇటీవల పనులు మంజూరు చేసిన 178 గ్రామాల్లో 167చోట్ల 20 పనులకు అటుఇటుగా ఉండనున్నాయన్న అంచనాకు వచ్చారు. ఆ గ్రామాల్లో కొత్త పనులను చేపట్టేందుకు అవసరమైన హేతుబద్దీకరణ కసరత్తును ప్రస్తుతం చేస్తున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 02:37 AM