Share News

అవస్థల ప్రయాణం

ABN , Publish Date - Sep 02 , 2026 | 10:57 PM

కొరిశపాడు మండలంలోని దైవాలరావూరు-బొల్లావరప్పాడు గ్రామాల మధ్య పంచాయతీరాజ్‌ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఈ రోడ్డు మీద ప్రయాణించలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

అవస్థల ప్రయాణం
ఽధ్వంసమైపోయిన దైవాలరావూరు-బొల్లవరప్పాడు రోడ్డు

దైవాలరావూరు-బొల్లవరప్పాడు గ్రామాల మధ్య పూర్తిగా ధ్వంసమైన రోడ్డు

నిధులు మంజూరైనా మొదలు కాని పనులు

మూడేళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రజలు

మేదరమెట్ల, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి) : మూడేళ్ల నుంచి గుంతల రోడ్డులోనే నానా ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు చేస్తున్నారు. గత ఏడాది నుంచి రోడ్డు పూర్తిగా ధ్వంసమై కంకర రాళ్లపైనే వాహనాలు ప్రయాణించాల్సి వస్తోంది. ఇక పాదచారుల అవస్థలు వర్ణనాతీతం. ధ్వంసమైన రోడ్డు స్థానంలో కొత్తగా నిర్మించేందుకు నిధులు మంజూరైనా పనులు మొదలు కాలేదు. కొరిశపాడు మండలంలోని దైవాలరావూరు-బొల్లావరప్పాడు గ్రామాల మధ్య పంచాయతీరాజ్‌ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఈ రోడ్డు మీద ప్రయాణించలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. బొల్లవరప్పాడు, పమిడిపాడు, రాచపూడి, ప్రాసంగులపాడు, అనుబ్రోలువారిపాలెం, కావూరివారిపాలెం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ఈ రోడ్డు నుంచే ప్రయాణిస్తుంటారు. అద్దంకి, ఒంగోలు, గుంటూరు వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ రోడ్డు నుంచే మేదరమెట్ల వచ్చి హైవేపై ప్రయాణిస్తుంటారు. పొగాకు, మిరప, పత్తి, శనగ, మినుము వంటి పంటలను కోల్డ్‌ స్టోరేజిలో నిల్వ ఉంచేందుకు తీసుకువెళ్లాలన్నా, మార్కెట్‌లో అమ్ముకోవాలన్నా ఈ రోడ్డులోనే ప్రయాణించాల్సి ఉంది. మేదరమెట్ల, దైవాలరావూరు వైపు నుంచి నిడమానూరు, నాగులుప్పలపాడు, ఇటు పమిడిపాడు గ్రామాలకు వెళ్లాలన్నా ప్రజలు ఈ రోడ్డునే ఉపయోగిస్తుంటారు. మూడేళ్ల క్రితమే పాడైపోయిన ఈ రోడ్డుకు తూతుమంత్రంగా మరమ్మతులు చేసినప్పటికీ ఆరు నెలల్లోనే పూర్వ స్థితికి చేరింది.


రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన మేరకు 2.6 కిలోమిటర్లు పొడవు ఉన్న ఈ రోడ్డు నిర్మాణానికి 1.90 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు. నిధులు మంజూరు చేయించి చాలా కాలమైనా టెండర్ల ప్రక్రియ నిదానంగా సాగింది. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ కాకుండా కొంతకాలం ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకురెండు నెలల క్రితం అగ్రిమెంట్‌ అయిన కాంట్రాక్టర్‌ త్వరగా పనులు మొదలు పెట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైన స్పందించి పనులు వేగంగా నాణ్యతతో జరిగేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పనులు త్వరలో మొదలు పెడతాం

ప్రసాద్‌, పీఆర్‌ ఏఈ

దైవాలరావూరు-బొల్లవరప్పాడు రోడ్డు పనులను త్వరలో మొదలు పెడతాం. ఇరాన్‌ యుద్ధం వలన తారు కొరత ఉండడంతో పనులు మొదలు పెట్టడం అలస్యమైంది. త్వరలోనే పనులు ప్రారంభించి నాణ్యతతో పూర్తిచేస్తాం.

Updated Date - Sep 02 , 2026 | 10:57 PM