కనిగిరిలో చరిత్రాత్మక ఘట్టం
ABN , Publish Date - Jun 07 , 2026 | 02:45 AM
కనిగిరిలో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర, రాష్ట్రస్థాయి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ సామాజికవర్గాల నాయకులు హాజరయ్యారు.
ఘనంగా అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ
హాజరైన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు అనిత, స్వామి
పలువురు ప్రముఖులు రాక
వేలాదిగా తరలివచ్చిన ప్రజలు
పట్టణంలో పండుగ వాతావరణం
కనిగిరి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : కనిగిరిలో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర, రాష్ట్రస్థాయి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ సామాజికవర్గాల నాయకులు హాజరయ్యారు. దీంతోపట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి చిరాగ్ పాశ్వాన్ ముఖ్యఅతిఽథిగా పాల్గొని అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ప్రత్యేకఅతిథులుగా హాజరయ్యారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవానికి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి అన్నివర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. అంబేడ్కర్ ఫొటోతో ఉన్న జెండాలను చేతపట్టి చిన్నారులు, యువత కేరింతలు కొట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా అంబేద్కర్ విగ్రహావిష్కరణను ఆసాంతం వీక్షించారు. తొలుత పట్టణంలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయం నుంచి డప్పు వాయిద్యాల మధ్య వేలాది మంది ప్రజలతో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను మళ్లించి విగ్రహావిష్కరణ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.