చిన్నిగుండెకు పెద్ద భరోసా
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:23 AM
ఆ చిన్నారికి సరిగ్గా రెండేళ్ల వయస్సు కూడా లేదు. బుడిబుడి నడకలు, బోసినవ్వులతో ఉండాల్సిన వయస్సులో పుట్టుకతోవచ్చిన గుండెజబ్బు పెద్ద సమస్యగా మారింది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ పేద కుటుంబా నికి భారమైంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు ముక్కుపచ్చలారని పసిబిడ్డ ఆరోగ్యం తలుచుకుని తల్లిడిల్లుతున్న ఆ కుటుంబం పట్ల జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి మానవత్వం చూపారు.
జేసీ కల్పనాకుమారి మానవత్వం
అత్యున్నత వైద్యం అందించేందుకు అధికారుల చర్యలు
ఒంగోలు కార్పొరేషన్, నవం బరు 28 (ఆంధ్రజ్యోతి): ఆ చిన్నారికి సరిగ్గా రెండేళ్ల వయస్సు కూడా లేదు. బుడిబుడి నడకలు, బోసినవ్వులతో ఉండాల్సిన వయస్సులో పుట్టుకతోవచ్చిన గుండెజబ్బు పెద్ద సమస్యగా మారింది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ పేద కుటుంబా నికి భారమైంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు ముక్కుపచ్చలారని పసిబిడ్డ ఆరోగ్యం తలుచుకుని తల్లిడిల్లుతున్న ఆ కుటుంబం పట్ల జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి మానవత్వం చూపారు. వారికి అభయహస్తం అందించారు. చిన్నారికి అత్యాఽధునిక వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకెళితే.. మేదరమెట్లకు చెందిన శ్రీనివాసరావు, అశ్వని దంపతులకు కుమారుడు టి.కార్తీక్ (17నెలలు)కు పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు (వీఎస్డీ, ఏఎస్డీ), న్యూమోనియాతో ప్రస్తుతం ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగం ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి ఆరోగ్యం విషయం జేసీ కల్పనాకుమారికి తెలియడంతో వెంటనే జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి.వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని అవసరమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో శనివారం డీఆర్వో, డీఎంహెచ్లు జీజీహెచ్‌కు చేరుకొని కార్తీక్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాలుడు పరిస్థితి, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స, తదుపరి చర్యలు గురించి పిల్లల వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడు ఆయాసంతో బాధపడుతున్నాడని, ఆరోగ్య పరిస్థితి కుదుటపడిన అనంతరం తిరుపతి, గుంటూరులో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో డీఆర్వో, డీఎంహెచ్లు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు.