Share News

దివ్యాంగులకు వరం.. సదరం

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:32 AM

రాష్ట్రం లోని దివ్యాంగులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. సామాజిక భద్రత పింఛన్‌లు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, సౌకర్యాలు పొందడానికి తప్పనిసరి అయినసదరం సర్టిఫికెట్‌ల కోసం స్లాట్‌ బుకింగ్‌ను పునఃప్రారంభించింది.

దివ్యాంగులకు వరం.. సదరం
ఒంగోలు రిమ్స్‌లోని సదరం కేంద్రం (ఫైల్‌)

డిజిటల్‌ విధానంలో జారీ

సచివాలయాల్లో ఉచితంగా నమోదు చేసుకునేలా ఆదేశాలు

ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న వారికీ అవకాశం

ఒంగోలు కార్పొరేషన్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లోని దివ్యాంగులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. సామాజిక భద్రత పింఛన్‌లు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, సౌకర్యాలు పొందడానికి తప్పనిసరి అయినసదరం సర్టిఫికెట్‌ల కోసం స్లాట్‌ బుకింగ్‌ను పునఃప్రారంభించింది. పూర్తిస్థాయిలో ఉచితంగా నమోదుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే దివ్యాంగులకు పింఛన్‌ల పెంపుతో భరోసా కల్పిస్తుండగా, ఈ ఏడాది ఉగాది రోజున దివ్యాంగ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లోఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. దివ్యాంగులకు అత్యంత ప్రాముఖ్యమైన సదరం సర్టిఫికెట్‌ను నూత నంగా డిజిటల్‌ విధానంలో అందించేందుకు సిద్ధమైంది. నమోదు ప్రక్రియను ఉచితం చేసింది. ప్రత్యేకించి వైకల్య నిర్ధారణకు కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటివరకు కొన్ని రకాలవైకల్యాలకు మాత్రమే అవకాశం ఉండగా, మరో ఐదు కొత్త వర్గాలను కూడా చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బుధవారం నుంచే స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించింది.ప్రతి సోమ, మంగళవారాల్లో సచివాలయాల్లో ఉచితంగా నమోదు చేసుకోవాలని పేర్కొంది. దీంతో జిల్లాలో సదరం సర్టిఫికెట్‌ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది మందికి ఇది వరంగా మారనుంది.

జిల్లాలో వైద్య పరీక్షలు చేసే ఆసుపత్రులు

కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి, మార్కాపురం జిల్లా ఆసుపత్రి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఏరియా ఆసుపత్రుల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే మంజూరైన సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌ కొనసాగుతుండగా ఆ ప్రక్రియ మరో మూడు నెలల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సచివాలయాల ద్వారా ఉచితంగా నమోదు చేసుకున్న దరఖాస్తులను ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఈనెల 30, 31 తేదీల్లో స్వీకరిస్తారు. 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ప్రభుత్వం మంజూరు చేసే సామాజిక భద్రత పింఛన్‌ పొందేందుకు అర్హులు. దీంతోపాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైలు ప్రయాణాల్లో రాయితీ, విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన రిజర్వేషన్‌ కోటా పొందేందుకు, వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు పొందేందుకు సదరం సర్టిఫికెట్‌లే కీలకం.

21 రకాల వైకల్యాలకు మంజూరు

దివ్యాంగులకు అవసరమైన సదరం సర్టిఫికెట్‌ మంజూరుచేయాలంటే గతంలో కొన్ని వైకల్యాలకు మాత్రమే అవకాశం ఉండేది. అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం 21 రకాల వైకల్యాలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కుష్ఠు, దృష్టి సంబంధిత లోపాలు, వినికిడి లోపం, లోకోమోటార్‌ వైకల్యం, మానసిక సమస్యలు, బహుళ లోపాలు,న్యూరోలాజికల్‌ సమస్యలు, మాటల లోపం, రక్త సంబంధిత సమస్యలు, ఆరోగ్య సంబంధిత వైకల్యం ఉన్నాయి. వీటితోపాటు యాసిడ్‌ దాడి బాధితులు, పార్కిన్సన్స్‌ వ్యాధి, మల్టిపుల్‌ సిరోసిస్‌, సెరెబ్రల్‌ పాలసీ ఇతర సమస్యలకు గతంలో సర్టిఫికెట్‌లు మంజూరు చేసేవారు. కొత్తగా యూనిక్‌ బేస్డ్‌ డిజిటల్‌ సర్టిఫికెట్‌, ఆటిజం, నరాల సమస్య, స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సమస్యలను చేర్చారు.

సచివాలయాల్లో ఉచితంగా స్లాట్‌ బుకింగ్‌

సదరం సర్టిఫికెట్‌ పొందడానికి ప్రతి సోమ, మంగళవారాల్లో సచివాలయాల్లో ఉచితంగా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అందుకోసం ఆధార్‌ కార్డు, వైకల్యం కనిపించేలా ఫొటోలు, గతంలో చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్టులు తీసుకెళ్లి అక్కడ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. అలాగే ఆధార్‌ నెంబర్‌ లింక్‌ అయిన మొబైల్‌ను తీసుకెళ్లాలి. ఆతర్వాత ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వారు తెలిపిన తేదీలలో సంబంధిత డాక్టర్లు పరీక్షలు చేసి, వైకల్యం శాతాన్ని పేర్కొంటూ సర్టిఫికెట్‌మంజూరు చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ సెక్రటరీని సంప్రదించాలి. అలాగే గతంలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని హాజరుకాలేకపోయిన వారు, పెండింగ్‌లో ఉన్న వారు తిరిగి వైద్య పరీక్షలకు అవకాశం కల్పించారు.

Updated Date - Mar 26 , 2026 | 02:32 AM