Share News

ఆగని ఆట

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:06 AM

మార్కాపురం జిల్లాలో జూదం జూలు విదుల్చుతోంది. ఎక్కడికక్కడ పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. రోజుకు రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. అనేక మంది పేకముక్కల్లో చిక్కి బయటకు రాలేక ఆర్థికంగా చితికిపోతున్నారు.

ఆగని ఆట

టాస్క్‌ ఫోర్స్‌ వస్తేనే పట్టివేత

స్థానిక పోలీసులకు కనిపించని పేకాట

పలుచోట్ల యథేచ్ఛగా స్థావరాలు

చేతులు మారుతున్న రూ.కోట్లు

జిల్లా అధికారులకు సమాచారం అందితేనే దాడులు

స్టేషన్‌లో తెలిసిందంటే తప్పించుకున్నట్టే!

మార్కాపురం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లాలో జూదం జూలు విదుల్చుతోంది. ఎక్కడికక్కడ పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. రోజుకు రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. అనేక మంది పేకముక్కల్లో చిక్కి బయటకు రాలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈనేపథ్యంలో పేకాటపై ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో ఆయన ప్రత్యేకంగా టాస్క్‌ఫో ర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల వీరు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అనేక మంది జూదరులను అరెస్టు చేశారు. దీన్నిబట్టి స్థానిక పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. పేకాట స్థావరాల నిర్వాహకుల నుంచి మామూళ్లు ముట్టడం, కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. మార్కాపురంతోపాటు మిగిలిన పట్టణాలు, పల్లెల్లో కూడా స్థావరాలు నడుస్తు న్నాయి. కొందరు దీన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. ముఖ్యంగా మార్కాపురంలో లాడ్జిలు, అద్దె గదులు, కొన్ని అపార్ట్‌మెంట్‌లలో పెద్దఎత్తున పేకాట శిబిరాలను కొనసాగిస్తున్నారు. ఇక్కడికి ఇతరప్రాంతాల నుంచి జూదరులు వస్తున్నారు. రోజుకు రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. నిర్వాహకులు ప్రతి ఆటకు కొంత కమీషన్‌ తీసుకుంటున్నారు. జూదరులకు అక్కడే సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. స్థానిక పోలీసులు మామూళ్లు తీసుకొని మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పలుచోట్ల ఇలాంటి పరిస్థితే నెలకొన్నట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతో కొన్నిచోట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. పొదిలి- కొనకనమిట్ల ప్రాంతాల్లో ప్రతిరోజూ రూ.10 లక్షలకుపైన కోతముక్క ఆట నడుస్తున్నట్టు సమాచారం.

పేకాట కట్టడిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి

పేకాట, గంజాయి కట్టడిపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు సిబ్బందిని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా మార్పు రాకపోవడంతో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఆయన వాట్సప్‌ నంబరుకు వచ్చిన సందేశం, డయల్‌ 112కు వచ్చిన సమాచారం నేరుగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఇచ్చి వారి ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యపాలు జరుగుతున్నట్లు బయటపడితే స్థానిక పోలీసు అధికారులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి హెచ్చరిస్తున్నారు. కొందరిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు.

నేరుగా జిల్లా అధికారులకు సమాచారం ఇస్తున్న ప్రజలు

నిత్యం స్థానిక ప్రజలతో సంబంధాలు ఉండే పోలీసులను కాదని నేరుగా జిల్లా అధికారులకు, టోల్‌ఫ్రీ నంబర్‌కు ఎందుకు సమాచారం ఇస్తున్నారో వారికే తెలియాలి. టాస్క్‌ఫోర్స్‌ పేరుతో ఏర్పాటైన పోలీసులు వచ్చి దాడులు చేసి పట్టుకుంటే తప్ప స్థానిక పోలీసులకు స్థావరాల జాడతెలియకపోవడం విడ్డూరంగా ఉంది. జిల్లా పోలీస్‌ టీం నేరుగా వస్తేనే జూదరుల ఆట కట్టడి చేయగలుగుతున్నారు తప్ప, స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే ఆటగాళ్లు జారుకుంటున్నారని తెలిసింది. ఇటువంటి సందర్భాలు కూడా ఇటీవల ఉన్నట్టు సమాచారం. ఒంగోలు నుంచి టాస్క్‌ఫోర్స్‌ రావడం ఇబ్బందికరంగా ఉండటంతో మార్కాపురంలోనే ఒక టీం ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది.

ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ దాడులు

మార్కాపురం పట్టణంలో ఒక లాడ్జిలో పేకాట ఆడుతున్నట్లు ఈనెల 11న సమాచారం అందుకున్న జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందం అక్కడ 17 మందిని అదుపులోకి తీసుకుంది. వారివద్ద రూ.63,750 నగదు స్వాధీనం చేసుకుంది. జూదరుల్లో శ్రీశైలం, సున్నిపెంట, మార్కాపురం, నాగులవరానికి చెందినవారున్నారు.

ఈనెల 7న పామూరు మండలం కట్టకిందపల్లిలోని పొలాల్లో పేకాట స్థావరం నడుస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం వెళ్లింది. వెంటనే దాడి చేసి ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కొంత నగదు, 4 బైక్‌లు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

ఈనెల 7న మార్కాపురం రూరల్‌ పరిధిలోని బోడపాడులో పేకా ట శిబిరంపై టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడిచేసి 14 మందిని అదుపులోకి తీసుకుంది. వారివద్ద రూ.55,860, 11 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది. కనిగిరి, పామూరు ప్రాంతాల్లోనూ కొన్ని దాడులు జరిగాయి.

Updated Date - Apr 15 , 2026 | 03:06 AM